31
మహారాష్ట్ర లో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వాసుపత్రిలో 24 గంటల్లో 24 మంది చనిపోవడం దేశం మొత్తాన్ని కలవరపెడుతోంది. శంకరరావు చవాన్ ప్రభుత్వాసుపత్రిలో 48గంటల్లో 31 మంది రోగులు చనిపోయారు. వీరిలో 16మంది నవజాత శిశువులు, చిన్నపిల్లలు ఉండటం విచారకరం. ఈమరణాలకు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమన్న వాదనను ఆస్పత్రి సూపరింటెండెంట్ తోసిపుచ్చారు. మందులు, డాక్టర్ల కొరత తమ ఆసుపత్రిలో లేనే లేదని, తగిన వైద్యం అందించినా, సకాలంలో మందులు వాడినా రోగుల నుంచి వైద్యానికి తగిన ప్రతిస్పందన లేదనీ తెలిపారు. పరిస్థితిని సమీక్షించడానికి మహారాష్ట్ర వైద్య విద్యా మంత్రి హసన్ ముష్రిఫ్ నాందేడ్ బయల్దేరారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మందులకు, డాక్టర్లకు అసలు కొరతేలేదని, ప్రతీ మరణం పైనా దర్యాప్తు జరుపుతామని, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
త్రిసభ్య దర్యాప్తు కమిటీ ఏర్పాటు 31
ఈ మరణాలపై దర్యాప్తు జరపడానికి ఒక కమిటీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. ఈకమిటీ వరుసమరణాలపై దర్యాప్తు జరిపి నివేదికను అందచేస్తుంది. పరిస్థితిని సమీక్షించడానికి తాను వ్యక్తిగతంగా అక్కడకు వెళుతున్నట్లు డీఎం అండ్ హెచ్ ఓ డైరక్టర్ డాక్టర్ దిలీప్ మై శేకర్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో వరుస మరణాలు ఏకనాథ్ షిండే ప్రభుత్వాన్నికుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాలు షిండే ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శిస్తున్నాయి.
విపక్షాల విమర్శలు 31
ఈసంఘటన అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించిన లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇంకా లోకం చూడని పసి పిల్లలు పుట్టీ పుట్టకుండానే చనిపోవడం చాలా చాలా చింతించాల్సిన విషయం. బాధాకరం.. అన్నారు. ఆగస్టులో థానే లోని ప్రభుత్వాసుపత్రిలో కూడా ఇలాగే 18మందిరోజులు ఒకే రోజు మరణించారని గుర్తు చేశారు.
షిండే సర్కార్ పై రాహుల్ విమర్శలు
ఇది మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ వైఫల్యం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రచారార్భాటాలకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, ప్రభుత్వాసుపత్రిలో పసిపిల్లలకు మందులు కొనే స్తోమత లేదా అని X (ట్విట్టర్) లో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా షిండే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నాందేడ్ ఆస్పత్రిలో శిశుమరణాలను ఆపాలని కోరారు. మరోవైపు సెప్టెంబర్ 30 ఈనెల 1వ తేదీ మధ్య అంటే 24 గంటల్లో చనిపోయిన 12 మంది నవజాత శిశువుల్లో ముగ్గురు బరువు తక్కువగా పుట్టారని వారికి బతికే ఛాన్స్ లేదని నాందేడ్ ఆస్పత్రి డీన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ప్రమాదకర పరిస్థితిలో ఇంకా 42 మంది
పిడియాట్రిక్ డిపార్టుమెంటులో ఈ 48 గంటల్లో 142 మంది చేరారని, వారిలో 42 మంది పరిస్థితి ఇంకా ప్ర మాదకరంగానే ఉందని డీన్ తెలిపారు. పిడియాట్రిక్ విభాగంలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రికి వచ్చిన వారంతా చుట్టుపక్కల హింగోలి, పర్బని, వసీం జిల్లాలకు చెందినవారన్నారు. మరికొందరు తెలంగాణలోని సరిహద్దు జిల్లాలనుంచి వచ్చారన్నారు.
మరణించిన వారిలో 12 మంది పెద్దవారు
ఇక మరణించిన వారిలో 12 మంది పెద్దవారు కూడా ఉన్నారని వారిలో ఐదుగురు మగవారు, ఏడుగురు మహిళలు అని తెలిపారు.వీరిలో నలుగురికి గుండె సంబంధిత సమస్యలున్నాయని, ఒకరు మాత్రం విషాహారం తిన్న వ్యక్తి అని తెలిపారు. మరొకరికి లివర్ సమస్య, మరోఇద్దరు కిడ్నీ రోగులు కాగా, మరో మహిళ ప్రసవ సంబంధ సమస్యలతో అడ్మిట్ అయ్యారని అన్నారు. మరో మూడు యాక్సిడెంట్ కేసులు కూడా ఉన్నాయన్నారు. అసలు విషయం ఇది కాగా ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయనిమందుల కొరత, గానీ, పరికరాల కొరత గానీ, సిబ్బంది, వైద్యుల కొరతగానీ, నిర్లక్ష్యం గానీ లేనే లేవని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మొత్తం మీద టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందినా 48 గంటల్లో 31 మంది చనిపోవడం అంటే సీరియస్ అంశమేనని భావించాల్సి ఉంది.