TS Elections
తెలంగాణ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లకు తోడు, రెండేసి, మూడేసి చోట్ల నామినేషన్లు వేస్తూ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు వాతావరణం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో కొంత ఎదురు గాలి వీస్తోంది.ప్రస్తుతానికి కాంగ్రెస్ వేవ్ కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఈ ముఖ చిత్రం ఎలా మారుతుందో తెలీదు…
రెండుచోట్ల బరిలో కేసీఆర్
మొత్తం మీద కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎప్పుడూ పోటీ చేసే గజ్వేల్ కు తోడు ఈసారి కామారెడ్డిలో కూడా ఆయన నిలబడుతున్నారు. అసలు కేసీఆర్ అంటేనే గెలుపుకి చిహ్నం అన్నంతలా ఉన్న బీఆర్ ఎస్ పార్టీ గడచిన కాలంలో చాలా ఎదురు దెబ్బలు తింది. ఇప్పుడు ఎన్నికల టైమ్ లో ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. ఊపిరి తీసుకునే వీలు లేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బీఆర్ ఎస్ శ్రేణులు ఎంత చెప్పుకున్నా ఇప్పుడు ఆ పార్టీకి కొంత ఎదురు గాలి వీస్తోందన్నది నిజం.. ఫలితాలు ఎలా ఉంటాయో అన్న సందేహంతోనే కేసీఆర్ ఈ సారి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు.అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ఆయన రెండు చోట్ల పోటీ చేస్తుంటే చెరో చోట ఆయన ప్రత్యర్ధులు సై అంటే సై అని మీసం దువ్వుతున్నారు. తొడ గొడ్తున్నారు.
ఢీ అంటే ఢీ!!! TS Elections
గజ్వేల్ లో ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. బీజేపి అభ్యర్ధిగా ఈటల నామినేషన్ వేశారు. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని నేత, జన సామాన్యానికి అందుబాటులో ఉన్న నేత, తెలంగాణ రాష్ట్ర సాధనకు నిజాయితీగా కృషి చేసిన నేత, కేసీఆర్ ప్రభుత్వం నుంచి అత్యంత అమానవీయ పద్దతిలో తొలగింపబడిన నేత.. ఆయనపై కక్ష సాధింపు రాజకీయాలు చాలానే జరిగాయి. ఆయన కోళ్ల ఫారాల బిజినెస్ ను రకరకాల కారణాలు తీసి దెబ్బ తీశారు. అయినా తట్టుకుని నిలబడి హుజూర్ నగర్ లో రికార్డు మెజారిటీతో ఈటల గెలుపొందారు. బీజేపిలో ఈటల ప్రాధాన్యత మొదట్లో కొంత తగ్గినా, ఇప్పుడు బాగానే ఉంది.
ఓటమి అన్నది ఇప్పటి వరకూ చూడని ఈ నేత కేసీఆర్ తో తలపడుతున్నారు. పైగా కేసీఆర్ మనస్తత్వం నుంచి ఎత్తుగడల వరకూ అన్నీ దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఈటల. కాబట్టి వీళ్ల మధ్య ఫైట్ కొదమ సింహాల మధ్య ఫైట్ లాంటిదే..గజ్వేల్ కు ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్ వాటిలో చాలా మటుకు నెరవేర్చలేదన్నది ఈటల ఆరోపణ.మొత్తానికి ఈటల మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.
సై అంటే సై!!! TS Elections
ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజక వర్గం కామారెడ్డి… ఈ కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు.. రేవంత్ అటు కొడంగల్ లోనూ, ఇటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలవడం అంత సులభం కాదన్నది కాంగ్రెస్ నేతల వాదన.బీఆర్ ఎస్ అధ్వాన్నపు పాలనపై ప్రజలు మండి పడుతున్నారని, ఈసారి కాంగ్రెస్ కే తమ ఓటు వేస్తారని ఆపార్టీ చెబుతోంది కామారెడ్డి ఫైట్ లో మరో ఇంట్రెస్టింగ్ కోణం కూడా ఉంది.ఇద్దరు నేతలు ఒకరి లక్కీ నెంబర్ రోజు ఒకరు నామినేషన్ వేస్తున్నారు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6. అదే రోజున రేవంత్ నామినేషన్ వేశారు. రేవంత్ లక్కీ నెంబర్ 9 . కేసీఆర్ ఆరోజున నామినేషన్ వేయబోతున్నారు. సమస్యల ధరణి,కాళేశ్వరం భాగోతం,కవిత లిక్కర్ స్కామ్, పథకాలలో లోపాలే అస్త్త్రాలుగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది.
కాళేశ్వరం అవినీతిపై ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ ఆశపడుతుంటే, ఓటమి ఎరుగని నేత, తెలంగాణ పితామహుడు, మాటల మరాఠీ, అయిన కేసీఆర్ చివరి వారం రోజుల్లోనూప్రజలకు చేసే అపీల్ కీలకమైనదిగా భావిస్తున్నారు. కేసీఆర్ మేనిఫెస్టోతో, సెంటిమెంట్ అస్త్రంతో గెలుస్తామని బీఆర్ ఎస్ ధీమాగా ఉంది.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి, 24 గంటల కరెంటు, రైతు బంధులే అస్త్రాలుగా కారు పార్టీ ప్రచారం సాగిస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ కు బరిలో నిలిచిన ప్రత్యర్ధులు సామాన్యులు కారు.రెండు జాతీయ పార్టీల ప్రతినిధులు. బీఆర్ ఎస్, బీజేపి ఒకటే అని కొందరు అంటున్నా… అక్కడ ఉన్నది తన శత్రువు ఈటల కాబట్టి మాటలు లేవు.మాట్లాడుకోడాల్లేవ్.. ఇక అంతా యుద్ధమే.