GLENN MAXWELL
మ్యాక్స్ వెల్.. మ్యాక్స్ వెల్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఏ ఇద్దరు కలిసినా ఈ ఆటగాడి అద్భుత ఇన్నింగ్స్ పై ముచ్చట్లే. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే , మాంచి కిక్కున్న ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు మొనగాడు.. సినిమా డైలాగులతో మ్యాక్స్ వెల్.. పై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మ్యాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతడో ఆణిముత్యం. ఓడిపోతుందనుకున్న టీమ్ ను సునాయాసంగా గెలుపు తీరాలకు చేర్చాడు.
అఫ్గానిస్థాన్ తో మంగళవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ తన అద్బుతమైన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా అనూహ్యరీతిలో విజయాన్ని అందుకుంది. అసమాన పోరాటంతో మాక్స్ వెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. టీమ్ కష్టాల్లో పడినప్పుడు, గెలుపు దారులు పూర్తిగా మూసుకుపోయినప్పుడు విధ్వంసకర బ్యాటింగ్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రత్యర్థులు సైతం అతడి ఆట తీరుకు సలాం కొట్టారు. ప్రశంసలతో పాటు పలు రికార్డులు కూడా సాధించాడు మాక్స్ వెల్.
అన్నీ తానై… అంతా తానై… GLENN MAXWELL
క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఇది. గ్లెన్ మ్యాక్స్ వెల్.. కు అయితే కెరీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియన్లు పాఠాలుగా చెప్పుకోవల్సిన మ్యాచ్. విపత్కర పరిస్థితుల్లో వరుసగా వికెట్లు పడిపోతున్న తరుణంలో ఒక్కడిగా నిలిచి మొత్తం ఇన్నింగ్స్ తానే ఆడి గెలిపించాడు. ఆఫ్ఘన్లు 292 పరుగుల భారీ లక్ష్యం ఛాదించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియా 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. 91 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా పని అయిపోయిందనుకున్నారు. అవతల క్రీజ్‌పై కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు.
ఇవతల గ్లెన్ మ్యాక్స్ వెల్.. ఉన్నాడు. అంతే మ్యాక్స్ వెల్… కి ఏం పూనిందో గానీ వికెట్ పడిన పాపాన పోలేదు. అంతవరకూ కొనసాగిన వికెట్ల పతనం ఆగిపోయింది. మ్యాక్స్ వెల్… తాను ఆడటమే కాకుండా కమిన్స్ అవుట్ కాకుండా నియంత్రించుకుంటూ వచ్చాడు. అజేయ డబుల్ సెంచరీతో మరోసారి తానెంత డేంజర్ బ్యాటర్ నో చాటిచెప్పాడు. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఛేజింగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా రికార్డు లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో దక్షిణాఫ్రికాపై జమాన్ 193 పరుగులు చేశారు. క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ కొట్టిన నాన్ ఓపెనర్ గా కూడా మ్యాక్స్ వెల్.. రికార్డు కెక్కాడు. 2009లో బంగ్లాదేశ్‌పై చార్లెస్ కోవెంట్రీ చేసిన 194 పరుగులను అధిగమించి ఈరికార్డును అందుకున్నాడు.
ఛేజింగ్ లో డబుల్ సెంచరీ
మ్యాక్స్ వెల్.. ఈ వరల్డ్ కప్‌లోనే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లోనే సెంచరీ చేసి వరల్డ్ కప్ ఫాస్టెస్ సెంచరీని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ బాదడం ద్వారా వరల్డ్ కప్‌లో ఛేజింగ్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకు మించి అసాధారణ ఇన్నింగ్స్ తో చరిత్రలో నిలిచిపోయే ఆట ఆడాడు. అప్ఘాన్‌పై మాక్స్ వెల్ ఇన్నింగ్స్‌ను వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తుమైందని అన్ని అన్నారు. 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన ఆటను మ్యాక్స్‌వెల్ మరిపించాడని అంటున్నారు.