TS Elections
ఎన్నికల హమీల పేరుతో పార్టీలు నేల విడిచి సాము చేస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే.. 42 పేజీలు,62 హామీలతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపు కోసం చావో రేవో అన్న రీతిలో తలపడుతోంది. అన్ని వర్గాలను ఆకట్టుకోడానికి చేసే ప్రయత్నంలో కొన్ని కొన్ని హామీలు ఆచరణ సాధ్యం కానివి కూడా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో ఆరు హమీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇక్కడ కూడా అదే మంత్రాన్ని ప్రయోగిస్తోంది. అధికారానికి ఆరు గ్యారెంటీల మంత్రం పఠిస్తోంది. అయితే మేనిఫెస్టో చూస్తే దాని అమలు కు తగిన బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర అసలు ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్ , బైబిల్ తో కాంగ్రెస్ నేతలు పోల్చుతున్నారు. ఇంతవరకూ బానే ఉంది. రేపు తప్పీ జారీ అధికారం వస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న సోయ కాంగ్రెస్ నేతలకు ఉందో లేదో మరి.
అయ్యే పనేనా? TS Elections
అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతులకు 2 లక్షల రుణ మాఫీ, 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం, ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ లాంటివి ప్రత్యేక ఆకర్షణలు. దీనికి తోడు ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రతీరోజు ప్రజాదర్బార్ లు నిర్వహిస్తామని, ట్రిపుల్ ఐటీలు మరిన్ని ఏర్పాటు చేస్తామని, 18 ఏళ్లు నిండిన వారందరికీ స్కూటీ, ఇస్తామనీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి, కౌలు రైతులకు ఏడాదికి 15 వేల ఆర్థిక సాం అందిస్తామన్నారు. ఇక రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సాయం, ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి అనే సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. వీటితో పాటు ఇంకా చాలా హామీలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
మహాలక్ష్మి స్కీమ్ పేరుతో ప్రతీ నెల అర్హులైన మహిళలకు రెండువేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం కల్పిస్తారు. అంతేకాదు 5 వందలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. వీటిల్లో ఎన్ని హామీలు అమలవుతాయో చూడాలి. కర్ణాటకలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడానికి కిందా మీదా పడుతోంది.
అగ్ని పరీక్ష ఈ ఎన్నికలు…
దక్షిణాదిన ఏ ముఖ్యమంత్రీ ఇప్పటి వరకూ హ్యాట్రిక్ కొట్ట లేదని చరిత్ర చెబుతోంది. మరిప్పుడు కేసీఆర్ హాట్రిక్ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పుష్కలంగా ఉంది. దీనిని క్యాష్ చేసుకోవాలంటే ఈ హామీలతో పాటు కాంగ్రెస్ నేతలల్లో సిన్సియారిటీ ఉండాలి.ఇన్నాళ్లు నాయకత్వ సమస్యతో బాధపడిన కాంగ్రెస్ కు ఇప్పుడు రేవంత్ లాంటి నేత వచ్చాడు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయేమో చూడాలి. ఈసారి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోయినట్లే.. అందుకే కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి.. ఇక రేవంత్ కు కూడా ఈ ఎన్నికలు చావో రేవో తేల్చేవే.. ఈసారి పార్టీ ఓడిపోతే ఆయన పీసీసీ చీఫ్ పదవికి ఎసరు రావొచ్చు.. కాబట్టి కాంగ్రెస్ ఆడుతున్న ఈ పవర్ ప్లే కలిసొస్తుందో లేదో చూడాలి.
TS Elections