TS Elections
తెలంగాణను ఎన్నికల ఫీవర్ పూర్తిగా కమ్మేసింది.పట్టుమని పదిరోజులు కూడా లేని ఎన్నికల కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని నేతలంతా తిరుగుతున్నారు. ఈసారి రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయడం సీఎం కేసీఆర్ స్పెషాలిటీ. రెండిటిలో పోటీ చేయడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఒకటి గజ్వేల్ లో ఆయన ఏటికి ఎదురీదుతున్నాడన్నది ఒక టాక్.. అందుకే సేఫ్ సైడ్ గా కామారెడ్డినుంచి కూడా బరిలోకి దిగుతున్నారని కాంగ్రెస్ లాంటి పార్టీలు విశ్లేషణలు ఇస్తున్నాయ్.. అయితే బీఆర్ ఎస్ అధిష్టానం మాత్రం వ్యూహాత్మకంగానే రెండింటి నుంచి నిలబడుతున్నట్లు చెబుతోంది. ఇక్కడ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక బీజేపి నుంచి కాటిపల్లి వెంకట రమాణారెడ్డి బరిలో నిలిచారు. దీంతో కామారెడ్డిలో ముక్కోణపు పోటీ ఉంది.
ప్రభుత్వ వ్యతిరేకతే అస్త్రం… TS Elections
క్షేత్ర స్థాయిలో బలా బలాల విషయానికొస్తే.. రేవంత్ రెడ్డికి నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. అయితేనేం దాన్ని అధిగమించేందుకు ఆయన సోదరుడు, కొందరు ఎన్నారైలు సహా, బంధుమిత్రులంతా కామారెడ్డిలోనే బస చేసి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రేవంత్ ఇప్పటికే రెండు, మూడు సార్లు బహిరంగ సభల్లో మాట్లాడాడు. రాహుల్, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు కూడా వచ్చి ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతనే కాంగ్రెస్ బలంగా నమ్ముకుంటోంది. అదీకాక ఈసారి కాంగ్రెస్ కి వేవ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఓటుగా మారితే అది ఖచ్చితంగా తమ ఖాతాలోనే పడుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. అందుకే రేవంత్ విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. కొడంగల్ లో రేవంత్ ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు ఒక రకంగా రేవంత్ నాయకత్వానికి కూడా పరీక్ష లాంటివే. కాంగ్రెస్ ప్రతిభ అంతంత మాత్రంగా ఉంటే పీసీసీ చీఫ్ ని మార్చే అవకాశం ఉంది.
పథకాలు గెలిపిస్తాయా?
ఇక కేసీఆర్ కు కామారెడ్డి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే రెండు, మూడు సార్లు మీటింగులు పెట్టారు. ప్రగతి భవన్ కు పిలిపించి ముఖ్య కార్యకర్తలతో భేటీలూ జరిగాయి. బైక్ ర్యాలీలు, మీటింగులు, కార్నర్ షోలు ఇలా బీఆర్ ఎస్ కూడా హడావుడి చేస్తోంది. తెలంగాణ సాధించిన నేతగా, పథకాల ప్రదాతగా కారు గుర్తుకే ఓటు వేయమంటూ కేసీఆర్ కోరుతున్నారు. రైతులకు 24 గంటల కరెంటు, దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఖాతాలో చాలా విజయాలే ఉన్నాయి.అదే టైమ్ లో పథకాలు అందని వారిలో, యువతలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిరుద్యోగ యువత ఈసారి కేసీఆర్ ను దింపేయాలని కంకణం కట్టుకుంది.కాళేశ్వరం అవినీతి, కుమార్తె లిక్కర్ స్కాం ,దళిత బంధు అందరికీ ఇవ్వకపోవడం లాంటి సీరియస్ ఇష్యూస్ ఆయనకు వ్యతిరేకాంశాలుగా మారనున్నాయి. అయితే కేసీఆర్ చాణక్యాన్ని ఎవరూ అంచనా వేయలేరు. ఇక మిగిలింది పది రోజుల సమయమే కాబట్టి బూత్ మీటింగులు, సర్దుబాట్లు వేగంగా సాగుతున్నాయ్.ఎన్నికల రోజు బూత్ మేనేజ్ మెంట్ ఉండనే ఉంటుంది.
సర్వశక్తులు ఒడ్డి… TS Elections
ఈ ముక్కోణపు పోటీలో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి కాటిపల్లి వెంకట రమాణా రెడ్డి.. ఆయనకు నియోజక వర్గంలో వ్యక్తిగతంగా మంచి పేరుంది.సౌమ్యుడనీ అందరికీ అందుబాటులో ఉంటారనీ పేరుంది. మొదటనుంచి ఒక ప్రణాళికా బద్ధంగా ఆయన సైలెంట్ గా తన పని తను చేసుకు పోతున్నారు. కనపడకుండానే రమణారెడ్డి ప్రచారంలో అందరికన్నా ముందున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇది ఓటుగా మారి ఎవరి చేతిలో పడుతుందో చెప్పడం కష్టం. కేసీఆర్, రేవంత్ లాంటి దిగ్గజాల పోరులో ఓట్లు చీలి రమణారెడ్డికి ఉపయోగపడొచ్చు. లేదా రేవంత్, వర్సెస్ వెంకట రమణారెడ్డి మధ్య బిగ్ ఫైట్ కేసీఆర్ కు వరంగా మారుతుందా? కామా రెడ్డి ఎవరి ఖాతాలో పడుతుందో మరి..