TS Elections KTR
తెలంగాణ ఎన్నికలు రకరకాల మేనిఫేస్టోలను తెరపైకి తెస్తున్నాయి. ఇప్పటి వరకూ బిలో మిడిల్ క్లాస్ మహిళలనే టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీలు హమీల వర్షం కురిపించాయి. వారికి సంక్షే పథకాలు, పెన్షన్లు., గ్యాస్ సిలిండర్లు అంటూ ఊదరగొడుతున్నాయి. అయితే ఓటర్లను ఆకర్షించడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన బీఆర్ ఎస్ ఇప్పటి వరకూ ఎవరూ ఫోకస్ చేయని ఆధునిక తెలంగాణ మహిళా ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. ఎడ్యుకేటెడ్, హౌస్ వైఫ్స్, లేదా మధ్యతరగతి వర్కింగ్ లేడీస్ ఇలా ప్రత్యేక ఓటు బ్యాంకును గురిపెట్టి ఓ కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్ నగరంలోని ఓ పేరున్న హోటల్ లో విమెన్ ఆస్క్ కేటీఆర్ అనే ఓ ప్రైవేట్ చిట్ చాట్ కార్యక్రమం కేవలం మహిళలను మాత్రమే అనుమతిస్తూ నిర్వహించారు.
అందులో పాల్గొన్న మహిళలను సమ్మోహన పరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ సహజంగా మంచి వక్త…అందరికీ అర్ధమయ్యేలా, తాను చెప్పాల్సింది సూటిగా మనసులను తాకేలా క్లుప్తంగా చెప్పడంలో దిట్ట.. ఈకార్యక్రమంలో ఆధునిక తెలంగాణ మహిళను ఆకర్షించేలా ఎన్నో వాగ్దానాల జల్లు కురిపించారు. మహిళల గురించి తాను ఎక్కువగా ఆలోచిస్తుంటానని, మహిళా సంక్షేమం, లేదా వారి స్వతంత్ర్య వ్యక్తిత్వం అన్నది ముందు ఇంటినుంచే అమలు చేస్తాననీ అన్నారు. మహిళలకు నగరంలో భద్రమైన వాతావరణం కల్పించే విషయంలో కొంత ఆలోచన జరుగుతోందన్నారు. సైబర్ క్రైమ్ చట్టాలు మరింత కఠినం చేస్తామని, నిందితులకు జైలు శిక్ష పడేలా చట్టాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు వన్ స్టాప్ సెంటర్ లాగా ఏరకమైన సమస్య వచ్చినా కాల్ చేసేందుకు ఒక నెంబర్ ను క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నామని అన్నారు.
TS Elections KTR
డిసెంబర్ 15 దాటాక రండి
మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో భద్రతతో కూడిన వాతావరణం కల్పించే దిశగా అడుగులు వేస్తాననీ అన్నారు. మహిళలంతా కూర్చుని ఆలోచించి అసలు ప్రస్తుత సినేరియోలో బహిరంగ ప్రదేశాల్లో భద్రత విషయంలో ఏం చేస్తే వారికి బాగుంటుందో ఐడియాలతో రావాలన్నారు. డిసెంబర్ 15 తర్వాత ఒక ఎజెండాతో వారు వస్తే దానిపై తాను కసరత్తు చేసి రానున్న అయిదేళ్లలో అమలయ్యే ఓ మహిళా మేనిఫెస్టోను రూపొందించి అమలు బాధ్యత తీసుకుంటానన్నారు. విమెన్ జిమ్ సెంటర్లు, విమెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఇప్పటికే ఏ ప్రభుత్వమూ చేయనంత మహిళల కోసం చేశామన్నారు. అమ్మఒడి, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలన్నీ మహిళలకోసమే రూపొందించామని చెప్పుకొచ్చారు.
నగరం విస్తరిస్తున్న కొద్దీ శాంతి భద్రతలూ సమస్య అవడం ఎక్కడైనా కామన్ అనీ మహిళలకు భద్రమైన రవాణా వ్యవస్థ ఏర్పాటుపై తనకు ప్రత్యేక ఆలోచనలున్నాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక జిమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.అలాగే ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులు, అర్దరాత్రి అయినా స్టేషన్ నుంచి భద్రంగా ఇంటికెళ్లేందుకు ఉచిత వాహన సదుపాయం కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయన్నారు.ఈ వాహనాల్లో సీసీ కెమెరాలు, వాటి పర్యవేక్షణ యంత్రాంగం, ఫిర్యాదుల విభాగం లాంటి అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు.
డోంట్ వర్రీ గెలుపు మాదే
ఇలా మహిళలకు బోలెడు కార్యక్రమాలు చేయాలన్న తపన తనకు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తామని, ఆ తర్వాత ఓ పది రోజులు గ్యాప్ తీసుకుని మహిళా బృందం ఎజెండాతో రావాలని కోరారు. ఓ పక్క బీఆర్ ఎస్ ఈ ఎన్నికల్లో ఏటికి ఎదురీదుతోందని వార్తలు వస్తున్నా, ఐటీ బాస్ లో ఆత్మవిశ్వాసం జరంత కూడా తగ్గలేదు. కేటీఆర్ హామీల సంగతేమో గానీ ఆయన చిట్ చాట్ లో పాల్గొంటేనే హామీలు అమలైనంత సంబరపడుతున్నారు మహిళలు. ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ అర్బన్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఓట్ బ్యాంక్ ను పట్టించుకోలేదు. తొలిసారిగా బీఆర్ ఎస్ పట్టించుకుంది.కేటీఆర్ మంచి వ్యూహరచన చేయగలరు.. అర్బన్ మహిళలను ఆకట్టుకునేలా మాట్లాడగలరు కాబట్టి ఈ ఓటు బ్యాంక్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.