TS-TDP
తెలంగాణ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేశాయి. మరోవైపు అన్ని పార్టీలు ప్రచారంతో మోతెక్కిస్తున్నాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, భారీ బహిరంగ సభలు, డోర్ టు డోర్ మీటింగులు, ప్రత్యేకించి వార్డుకో మేనిఫెస్టో… (జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా చూడలేదు ఇంత హడావుడి) ఇలా రకరకాల ఎత్తులు, జిత్తులతో అభ్యర్ధులు నానా పాట్లూ పడుతున్నారు. ఎటు చూసినా కులం కాలిక్యులేషన్స్, మతం మతలబులు, ఇంకా చాలా చాలా లోకల్ లెక్కలు తెరమీదకి వస్తున్నాయ్… ప్రతీ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే…
పార్టీల పవర్ ప్లే…
కాంగ్రెస్ ఉనికి నిలబెట్టుకోకపోతే తెలంగాణలో కనుమరుగయ్యే ప్రమదముంది. బీఆర్ ఎస్ అధికారం నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి చిక్కులే… తెలంగాణలో ఉనికి చాటుకోకపోతే బీజేపికి దక్షిణాదిన ఎండ్ కార్డ్ పడినట్లే…ఇలా ప్రతీ పార్టీకి ఏదో ఒక ఆబ్లిగేషన్… అందుకే అన్నీ కలసి పవర్ ప్లే ఆడుతున్నాయి. ఓటరు కొట్టే సిక్సర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతీ పార్టీకి ఒక వ్యూహం ఉంది…ఒక్క తెలుగు దేశం పార్టీకి తప్ప… తెలంగాణ విభజన తర్వాత మట్టిలో కలిసిపోయిన పార్టీని మళ్లీ ఎలాగోలా నిలబెట్టాలన్న ఒక సామాజిక వర్గం తపన, చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు ఈ ఎన్నికల్లో ప్రతిఫలిస్తున్నాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో అధికారికంగా కలసి పోటీకి దిగి ఓడిపోయిన టీడీపీ ఈసారి బయటకు ఏం చెప్పకుండా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు పలుకుతోంది. ఖమ్మం ప్రచార సభలో తెలుగు దేశం నేతలు కాంగ్రెస్ అభ్యర్ధులకు జై కొడుతున్నారు… జై కాంగ్రెస్ అంటూ పచ్చ కండువాలు వేసుకుని నినాదాలు చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ రోడ్ షోలో సైతం పచ్చ జెండాలు రెపరెపలాడాయి. ఇక తుమ్మల నాగేశ్వర రావు అయితే టీడీపీ నేతలంతా కాంగ్రెస్ ని గెలిపించాలి… ఇక్కడ గెలిస్తే , ఏపీలో కూడా టీడీపీ గెలుస్తుంది అంటూ ఎర వేశాడు. ఇది చూసేందుకే కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. అస్తిత్వం కోసం ఇంకా బలవంతంగా టీడీపీ తన పచ్చ కండువాలను, జెండాలను సభల్లో తిప్పుతోంది.
ఇక్కడ ఇంకెక్కడి టీడీపీ ? TS-TDP
తెలంగాణ టీడీపీ అని చెప్పుకోడమే కానీ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరం.. కాంగ్రెస్ అధ్యక్షుడు , చంద్రబాబుకు వీరభక్త హనుమాన్ అయిన రేవంత్ గెలుపు కోసం టీడీపీ నానా గడ్డీ కరుస్తోంది. క్షేత్ర స్థాయిలో బాహాటంగా భుజం భుజం కలుపుకుని కాంగ్రెస్, టీడీపీ పనిచేస్తున్నాయి. ఏమీ లేని పార్టీని ఇంకా ఏదో ఉందన్నట్లు చంద్రబాబు మసి పూసి మారేడు కాయ ఎందుకు చేస్తున్నట్లు? ఇక దీని తోక పార్టీ జనసేనది మరో తీరు.. రెండు చోట్లా బీజేపితో పొత్తు ఉందంటూనే ఏపీలో టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకున్నాడు జనసేనాని. టీడీపీతో పొత్తు వద్దు అని బీజేపి బాహాటంగా పవన్ కు సూచించదు.. పవన్ లేకపోతే బీజేపికి ఆ మాత్రం దిక్కు కూడా లేదు ఏపీలో.. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవాలంటూ ఏపీలో కొందరు రెడ్లు కోరుకుంటున్నారు. తద్వారా టీడీపీ బలపడుతుందని, తెలంగాణలో మళ్లీ టీడీపీ చిగురిస్తుందని ఒక సామాజిక వర్గం ఆరాటం.. అంటే రేవంత్ రెడ్డిని టీడీపీ నేతలు తమ సామాజిక వర్గం నేతగా పరిగణిస్తున్నారన్నమాట.అదే రేవంత్ ను ఏపీలో రెడ్లు తమ రెడ్డి కులానికి చెందిన వాడని సంతోషిస్తున్నారు గెలవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కుల సమీకరణల ఆధారంగా రాజకీయం చేస్తున్న టీడీపీతో కులరహిత సమాజ స్థాపన అంటూ బయల్దేరిన పవన్ కల్యాణ్ పొత్తు..!?
కాంగ్రెస్ , టీడీపీలకు జీవన్మరణ సమస్య…
ఏతా వాతా టీడీపీ ఏపీలో మట్టికొట్టుకుపోతోంది. తెలంగాణలో ఎప్పుడో చతికిలబడింది. కాబట్టి అన్ని విధాలా నాశనమైన టీడీపీని బతికించేందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి. ఆ సమీకరణల్లో నీతిమంత రాజకీయాలు చేస్తానంటూ బయల్దేరాడు జనసేనాని. జోగి,జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు విభజన దెబ్బకు రెండు చోట్లా చెడిన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో మళ్లీ బతికి బట్ట కట్టేందుకు ట్రై చేస్తోంది. తెలంగాణ ఎన్నికలు అటు ఏపీ రాజకీయాలనూ ప్రభావితం చేయబోతున్నాయ్.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదే టీడీపీ ప్రయత్నాలు కలిసొచ్చేది లేనిది డిసెంబర్ 3న తేలుతుంది.
TS-TDP