Rat Hole Mining
ఉత్తరాఖండ్ సిల్క్యారీ టన్నెల్ లో 17 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలకు మోక్షం లభించనుంది. వారిని బయటకు తెచ్చే మార్గం సుగమమైంది. గనిలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది ఎట్టకేలకు విజయం సాధించారు. గని కార్మికులకు అతి దగ్గరగా చేరువ కాగలిగారు. టన్నెల్ లోనికి సొరంగ మార్గం తవ్వడం ద్వారా వారు కూలీలను చేరుకున్నారు. దీనికోసం నిషేధంలో ఉన్న ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ను ఉపయోగించి రాతిని 60 మీటర్ల మేరకు తొలిచి కార్మికులను చేరగలిగారు. దీనికోసం గతంలో హై ఎండ్ టెక్నాలజీ మిషన్లు, ఆగర్లు వినియోగించినా ఫలితం లేకపోయింది. దాంతో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నాలజీని వినియోగించారు.
బయటకు తరలింపుకు సర్వం సిద్ధం!
రాతిని తొలిచి ఆ మార్గంలో పైప్ లైన్ లు వేసి లోపలికి ఒక దారిని ఏర్పాటు చేశారు. ఈ దారి గుండానే వర్కర్లను బయటకు తరలిస్తారు. వారిని బయటకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది టన్నల్ లోకి వెళ్లి అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తరలించే అవకాశాలను పరిశీలిస్తారు. కూలీలను బయటకు తరలించాక వారిని వేగంగా సమీప ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ఒక్కొక్కరికోసం ఒక్కో అంబులెన్స్ చొప్పున 41 అంబులెన్సులను సిద్ధం చేశారు. వర్కర్లను ఆస్పత్రులకు తరలించే అంశంపై ఇప్పటికే అనేక సార్లు ప్రాక్టీస్ డ్రిల్స్ కూడా చేశారు. ఈ అంబులెన్సులు ఎలాంటి అడ్డంకి లేకుండా వేగంగా వెళ్లేందుకు గ్రీన్ కారిడార్లను కూడా సిద్ధం చేశారు. టన్నెల్ సైట్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రులను రెడీ చేశారు. 41 ఆక్సిజన్ ఏర్పాట్లున్న బెడ్స్, అవసరమైన మందులు, ఇతర పరికరాలు కూడా సర్వ సన్నద్ధంగా ఉంచారు.
ర్యాట్ హోల్ మైనింగ్ పై నిషేధం Rat Hole Mining
ఈ మైనింగ్ ను 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శాస్త్రీయ విధానం కాదంటూ నిషేధించింది. అయినప్పటికీ మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ టెక్నిక్ ను అమలు చేస్తున్నారు. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే నాలుగు అడుగుల వెడల్పుకు మించకుండా చిన్న చిన్న బొరియల్లా చేస్తూ బొగ్గును సేకరించండం. బొగ్గు సేకరణకు దగ్గరగా మైనర్ వెళ్లినప్పుడు టన్నెల్ ద్వారా పక్కలనుంచి బొగ్గును సేకరిస్తారు. తవ్విన బొగ్గు కుప్పలను దగ్గరలో వేస్తుంటారు. ఆ తర్వాత వాటిని హై వేల ద్వారా తరలిస్తారు. ఈ టెక్నిక్ ప్రకారం మైనర్లు గనిలోకి చిన్న చిన్న తవ్వే పరికరాలు పట్టుకుని వెళుతుంటారు. మేఘాలయలో బొగ్గు గనులను ఇలాగే తవ్వుతారు. ఇలా చిన్న చిన్న సొరంగాల్లా తవ్వడం వల్ల చిన్న పిల్లలను ఈ పనుల్లోకి దింపుతుంటారు. మేఘాలయలో ఉపాధి అవకాశాలు చాలా తక్కువ అందువల్ల జీవనాధారం కింద బొగ్గు తవ్వకం కూలీలుగా మారతారు. మైన్లలో ఉద్యోగం సంపాదించడానికి చిన్న పిల్లలు సైతంపెద్దవారిలా చెలామణీ అవుతూ బురిడీ కొట్టిస్తుంటారు.
ర్యాట్ హోల్ మైనింగ్ పై నిషేధం Rat Hole Mining
ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైన తవ్వకం కావడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిని నిషేధించింది. అయినా బొగ్గు గనుల్లో ఈ టెక్నాలజీని వినియోగించి దొంగ చాటుగా మైనింగ్ చేసేస్తూ ఉంటారు. భారీ వర్షాలు, వరదలు వచ్చి గని లోకి నీరు చేరినప్పుడు కూలీల ప్రాణాలే పోతుంటాయి.రాష్ట్ర ప్రభుత్వానికి మైనింగ్ ఏకైక ఆదాయ వనరు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వదిలేస్తూంటుంది.