ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ దక్కించుకున్న స్పోర్ట్స్ లీగ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రత్యేకతను చాటుతున్నది. ఆటకు ఆటతో పాటు ఆటగాళ్లకు సంపాదన, అభిమానులకు వినోదాన్ని అందిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అమితాసక్తిని కనబరుస్తారు. ఒకటి, రెండు సీజన్లలో మెరుగైన ప్రదర్శనలు చేస్తే ఆ ఆటగాడికి కళ్లు చెదిరే డబ్బులు అందుతున్నాయి. ఈ లీగ్ లో ఆడేందుకు పలువురు అంతర్జాతీయ స్థాయి స్టార్ ఆటగాళ్లు తమ జాతీయ జట్టు ఆడే మ్యాచ్ లను కూడా వదిలేస్తున్నారంటే ఈ లీగ్ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఆదరణ కలిగిన లీగ్ లో ఆడాలని తనకూ ఆశగా ఉందంటున్నాడు పాక్ క్రికెటర్ హసన్ అలీ.
ముంబై దాడుల తర్వాత పాక్ ఆటగాళ్లు IPL కి దూరం……
ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అంటే 2008 IPLలో షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది వంటి పాకిస్థాన్ అతిపెద్ద ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే ఆ సీజన్లో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. ఐపీఎల్ 2008లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సొహైల్ తన్వీర్ నిలిచాడు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత పాక్ ఆటగాళ్లుని ఐపీఎల్లో పాల్గొననివ్వకుండా నిషేధం విధించారు.
డాలర్ల టోర్నీలో ఆడాలని ప్రతి క్రికెటర్‌కు కల……
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రికెటర్లు అందరు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు. అలాగే ఈ మిలియన్ డాలర్ల టోర్నీలో ఆడాలని ప్రతి క్రికెటర్ కల కంటుంటాడు. కొందరు క్రికెటర్లు అందులో విజయం సాధిస్తే, కొంతమంది క్రికెటర్లకు మాత్రం ఈ కల కలగానే ఉంటుంది. అలాంటి వారిలో పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఎంతో మంది ప్రతిభ ఉన్నా పాక్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడలేకపోతున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడాలని ఇప్పటికే తమ కోరికను వ్యక్తం చేశారు. ఈ లిస్టులో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ కూడా చేరాడు.
అవకాశం వస్తే తప్పకుండా ఆడతాను… IPL
పాకిస్తానీ టీవీ షోలో హసన్ అలీ నుంచి మీకు ఐపీఎల్ ఆఫర్ వస్తే మీరు ఏమి చేస్తారు? అనే ప్రశ్న అడిగారు. దీనిపై హసన్ స్పందిస్తూ ఐపీఎల్ చాలా పెద్ద లీగ్. ఇందులో గ్లామర్ ఉంది. పొయిస్ ఉంది. ప్రతి ఆటగాడు ఐపీఎల్లో భాగం కావాలని కోరుకుంటాడు. నాకు ఐపీఎల్ ఆడాలని ఉంది. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా అక్కడ ఆడతాను అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ జట్టులో హసన్ అలీ…
హసన్ అలీ విషయానికొస్తే, అతను 2023 ODI ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. గాయపడిన నసీమ్ షా స్థానంలో హసన్ అలీ వన్డే ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన హసన్ అలీ 9 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.