Congress CM
తెలంగాణలో రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎంతో మంది ఎదురు చూపులకు, నిరీక్షణకు రేపటితో తెరపడుతుంది. మరో వైపు అసలైన రాజకీయం అప్పుడే మొదలవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే పట్టం కడుతున్నాయి. అసలు రిజల్ట్ ఎవరిని వరిస్తుందో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ లో అప్పుడే ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న అంశంపై పైకి కనపడని పెద్ద చర్చ, అంతర్మథనం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ తరహా పరిణామాలు తెలంగాణలోనూ జరుగుతున్నాయి. కర్ణాటక సీఎంగా డికె శివకుమార్ అవుతారని అందరూ ఆశించారు.
నిజానికి అక్కడ కాంగ్రెస్ గెలుపుకి 80 శాతం డికే ప్రచార సరళి, నాయకత్వ లక్షణాలే కారణం. సిద్దరామయ్య కురుబ కమ్యూనిటీకి చెందిన వాడు కావడం, ఆయనకు ప్రజల్లో కాస్త సింపతీ ఉండటం, వయసు రీత్యా ఈ ఒక్కసారికి తనకు సీఎం పదవి కావాలని ఆయన పట్టుబట్టడంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపింది. డీకె శివకుమార్ ను బుజ్జగించి డిప్యూటీ సీఎం పదవికి ఒప్పించింది. అయినా సిద్దరామయ్యను మించిన విశేష అధికారాలు, ప్రాధాన్యత డీకేకు కట్టబెట్టింది హై కమాండ్. సోనియా ఆంతరంగికులలో ఒకరిగా డీకే కు పేరు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ రేవంత్ డికె తరహాలో వర్కవుట్ చేయగల నేత. మల్లు భట్టి విక్రమార్కను సిద్దరామయ్య తో పోల్చవచ్చు…
సీఎంగా రేవంత్… Congress CM
తెలంగాణ విషయానికొస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పై ఆసక్తితో ఉన్నారు. జావకారిపోయిన కాంగ్రెస్ కు జవసత్వాలు కల్పించి మళ్లీ నిలబెట్టిన ఘనత తనదేనంటున్నారాయన.. ఆ మాట కొంత వరకూ నిజమే.. రేవంత్ వచ్చిన తర్వాతే కాంగ్రెస్ బలపడిందన్నది నిస్సందేహం.తనకు పదవులపై ఆకాంక్ష లేదని అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటానని రేవంత్ పైకి చెబుతున్నా ఆయన కాంగ్రెస్ లోకి వచ్చినదే సీఎం అవడానికి. కాబట్టి అవకాశాన్ని ఆయన అంత తేలికగా వదులుకోరు. ఇప్పటికే తన స్థాయిలో తనకు విస్తృత ప్రచారం ఆయన కల్పించుకుంటున్నారు. ఏ మీడియా ఛానెల్ చూసినా ఈ మధ్య కాలంలో రేవంతే కనిపిస్తున్నారు… కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా తనను తాను చెప్పకనే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.
హై కమాండ్ ను ఆకాశానికెత్తేయడం, సోనియా, రాహుల్, ప్రియాంకలను ప్రశంసలతో ముంచెత్తడం ఆయన తెలివి తేటలకు నిదర్శనం. రేవంత్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు అనుభవం గడించిన తెలివి తేటలు, చురుకుతనం, వాగ్ధాటి, ధైర్యంగా, నేరుగా దూసుకుపోయే తత్వం ఆయనకు ప్లస్ . మరే కాంగ్రెస్ నేతలోనూ ఈ లక్షణాలు లేవు. ఎవరూ స్పష్టంగా, గట్టిగా, సూటిగా, ప్రజలను తాకేలా మాట్లాడలేరు. ఈ కారణాలే ఆయన్ను లీడర్ గా ముందు వరసలో నిలబెట్టాయి. పీసీసీ పదవి చేపట్టగానే తన వ్యతిరేకులను సైతం ఆయన కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ పలకరించారు. ఇది ఆయన కలుపుగోలు తనానికి నిదర్శనం.
తెరపైకి దళిత సీఎం కార్డు
మరోవైపు రేవంత్ అంటే గిట్టని వారు ఆయన అవకాశాలను గండి కొట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి కాంగ్రెస్ దళితుడిని సీఎంను చేసి కేసీఆర్ ను నైతికంగా దెబ్బతీయాలన్నది రేవంత్ వ్యతిరేకులు వేస్తున్న ఎత్తుగడ. అందులో భాగంగానే మల్లు భట్టి విక్రమార్కను సీఎంను చేస్తారనే వార్తలు బలపడుతున్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటికే అతగాడికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
రేవంత్ ఒత్తిడికి హై కమాండ్ తలొగ్గుతుందా? Congress CM
మల్లును సీఎంను చేసి రేవంత్ ను డిప్యూటీ సీఎంను చేద్దామన్న ప్రతిపాదనలనూ రేవంత్ తిరస్కరించినట్లు సమాచారం. రేవంత్ ముఖ్యమంత్రి పదవిని మాత్రమే ఆశిస్తున్నారు. తనకు సీఎం పదవిని ఇవ్వని పక్షంలో ఆయన సైలెంట్ గా ఎంపీ ఎన్నికలు అయ్యే వరకూ వేచి చూసి ఆ తర్వాత తన నిర్ణయం తాను తీసుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు. రేవంత్ తన అనుచర ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని కూలగొట్టి సీఎం అవుతారనే అనుమానాలూ ఉన్నాయి.అయితే మల్లు భట్టి విక్రమార్క ఇలాంటి సందర్భాల్లో రాజకీయ ఎత్తుగడలను వేయడంలో బలహీనుడు.
ప్రభుత్వం కుప్పకూలితే కాంగ్రెస్ పై ఉన్న ముఠా కుమ్ములాటల మరక మళ్లీ తెరపైకి వస్తుంది. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. అందుకని హై కమాండ్ రేవంత్ రెడ్డి డిమాండ్ కు తలొగ్గి ఆయన్నే సీఎంను చేస్తుందని మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే సంగతులు… ఒకవేళ ఈసారీ బీఆర్ఎస్సే గెలిస్తే కాంగ్రెస్ కు మళ్లీ నిరాశ తప్పదు.