జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కల్యాణ్ చదువుతున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏది చెబితే అది మాట్లాడటం పవన్ తన అలవాటుగా మార్చుకున్నారని అన్నారు. ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయన ఆరోపణలు సేవ చేసే వాలంటీర్లను ఇలా కించపరుస్తారా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
వాలంటీర్ల వ్యవస్థపై…
కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ కల్యాణ్ చెబుతున్నారని, దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని కోరారు. చంద్రబాబును ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి లోకి పంపాలా? అన్న ఉత్సాహం తప్ప తాను ఏది మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు, పవన్ కు భయం పట్టుకుందని పేర్ని నాని విమర్శించారు. దమ్ముంటే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని మ్యానిఫేస్టోలో పెట్టాలంటూ పవన్ కు పేర్ని నాని సవాల్ విసిరారు.