తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోలవరం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీఎస్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన హరీశ్ రావు ఈరోజు కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టును విస్తరించడం వల్ల తెలంగాణకు నష్టమని, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు ముప్పు ఏర్పడనుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా గోదావరి నీటిలో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని హరీశ్ రావు మంత్రికి వివరించారు.
చట్ట విరుద్ధంగా…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న హరీశ్ అనుమతులు లేకుండానే పలు ఎత్తిపోతల పథకాలను కూడా నిర్మిస్తుందని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాను నిర్ణయించేందుకు కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కోరారు. తెలంగాణకు నీటి పంపిణీలో తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన హరీశ్ రావు వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులను కేటాయించాలని కోరారు.