విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈసారి విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా? లేదా? ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఆయనకు ఏ ఏ పార్టీల నుంచి ఆఫర్లున్నాయి. ప్రస్తుత టీడీపీ ఆయనను పక్కన పెట్టడం ఖాయమనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాని దారెటు అన్న చర్చ పొలిటికల్ కారిడార్ లలో జోరుగా సాగుతుంది. కేశినేని నానికి పార్టీలతో సంబంధం లేదు. తనకు ప్రజలతోనే అనుబంధం అని ఆయన చెబుతున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక గ్రూపును కేశినేని నాని ఏర్పాటు చేసుకున్నారు. రానున్నలోక్ సభ ఎన్నికలకు మాత్రం ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై రాజకీయంగా హట్ టాపిక్ గా మారింది.
రెండో సారి గెలిచి…
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కేశినేని నాని రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు దఫాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే టీడీపీకి రాగా, అందులో విజయవాడ ఒకటి. తొలి సారి గెలిచినప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఆయనకు గాని, ఆయన నుంచి పార్టీకి గాని లేవు. రెండోసారి గెలిచినప్పుడే తేడా కొట్టింది. ఎంపీగా రెండోసారి గెలిచిన తర్వాత పార్టీ హైకమాండ్ కు కేశినేని నానికి మధ్య గ్యాప్ పెరిగింది. అందరూ ఓటమి పాలయి తాను మాత్రమే గెలవడంతో నియోజకవర్గాల ఇన్ ఛార్జులను కూడా ఆయన పట్టించుకోలేదు. దీంతో పాటు విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు కూడా పార్టీ నేతలకు, కేశినేని నానికి మధ్య దూరంద పెంచేలా చేశాయి.
ఆ ఎన్నికల నుంచి…
కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ అభ్యర్థిగా నాని కుమార్తెను చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో టీడీపీ నేతలు దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, నాగులు మీరా, బొండా ఉమ వంటి వారితో విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాలు ఇలా ఉండగానే కేశినేని నాని సోదరుడు చిన్నిని పార్టీ హైకమాండ్ ప్రోత్సహిస్తుంది. దీంతో తనకు ఎసరు పెడుతున్నారని గ్రహించని నాని అందుకు అనుగుణంగా పార్టీ నేతలపై బహిరంగంగానే కామెంట్స్ చేయడం ప్రారంభించారు. దీంతో టీడీపీ హైకమాండ్ కూడా కేశినేని అంటేనే దూరం పెట్టే పరిస్థితికి వచ్చింది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు కూడా నానికి ఆహ్వానం ఉండటంలేదు. దీంతో విషయం అర్థమై పోయిన నాని తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీ ఫండ్స్ ను ఇవ్వడం ప్రారంభించడంతో దూరం ఇంకా పెరిగిందనే చెప్పాలి.
ఆఫర్లు ఉన్నా…
ఇటీవల కాలంలో ఆయన వైసీపీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు కేశినేని నానిని ప్రశంసించడం, నాని కూడా వైసీపీ ఎమ్మెల్యేలను కొనియాడటం చూస్తుంటే ఆయన వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. కేశినేని నానికి వైసీపీ నుంచే కాదు బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉందని చెబుతున్నారు. టీడీపీ ఈసారి ఎటూ తనకు టిక్కెట్ ఇవ్వదని డిసైడ్ అయిపోయిన నాని ఈ రెండింటిలో ఒక పార్టీని ఎంచుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోటీచేయడం ఖాయమని, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది చివరి నిమిషం వరకూ తేల్చకుండా సస్పెన్స్ లో ఉంచే విధంగా నాని ఉంటారన్నది ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. మరి నాని పార్టీ మారడం ఖాయం. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదే తేలాల్సి ఉంది.