దేశవ్యాప్తంగా టమాటా ఠారెత్తిస్తోంది. కిలో 150 రూపాయలకు చేరుతోంది. టమాటా ధర ఆకాశాన్నంటడంతో చాలా ఫుడ్ కంపెనీలు తమ ఉత్పత్తులలో టమాటా వినియోగించడం లేదని..టమాటా ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు టమాటా వినియోగదారుల కోసం వైసీపీ ప్రభుత్వం రైతు బజార్లలో కిలో.రూ.50కే టమాటాలు అందిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే టమాటాలను దోపిడీ దొంగులు ఎత్తుకెళ్లిపోతారనే భయంతో బౌన్సర్లను కూడా వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె రూరల్ మండలం బోడిమల్లదిన్నె గ్రామానికి చెందిన టమాట రైతు నారెం రాజశేఖర్ రెడ్డి (62), అతని భార్య జ్యోతి ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలంలోనే నివాసం ఉంటున్నారుఆయనకు ఇద్దరు కుమార్తెలు బిందు, కీర్తి. వారిద్దరికీ పెళ్లిళ్లు కాగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి పాలు పోయడానికి ఊళ్లోకి వెళ్లిన రాజశేఖర్‌ను మర్గం మధ్యలో అడ్డగించిన గుర్తు తెలియని దుండగులు పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు లాక్కెళ్లి హత్య చేశారు.
భర్త ఎంత సేపటికీ రాకపోయే సరికి అనుమానం వచ్చిన భార్య జ్యోతి కుమార్తెలకు సమాచారం ఇచ్చింది.వారు ఫోన్ చేయగా ఎవరూ ఎత్తలేదు. విషయం తెలుసుకున్న రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు వెతుక్కుంటూ వెళ్లగా దారి మధ్యలో ద్విచక్ర వాహనం, సెల్‌ఫోను పడి ఉండడం గమనించి చుట్టుపక్కల వెతుకగా చింత చెట్టుకింద చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న అన్న శవం కనిపించింది. వెంటేనే పోలీసులకు సమాచారంఅందించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయన నిన్న మార్కెట్‌కు 71 క్రేట్ల టమాటాను తీసుకువచ్చాడు. రైతు టమాటాలు అమ్మి వచ్చిన డబ్బులు దోచుకోవడానికి వచ్చిన దుండగులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.