వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షాలు ఎప్పుడు పడతాయో ఎలా పడతాయో ఎవ్వరం అంచనా వెయ్యలేము . కొన్ని సార్లు వర్షాకాలం మొదలు కాగానే జోరువానలు కురుస్తాయి. మరికొన్ని సార్లు వర్షాకాలం మొదలై రోజులు గడుస్తున్నా అస్సలు వానలే కురవవు. అయితే ఈ వానల్లో కూడా చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రకాల వర్షాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఏంటి అన్ని రకాల వర్షాలు ఉంటాయా అనుకుంటున్నారు కదా. మరి ఆ వర్షాల పేర్లోంటో వాటి అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వానలు.. రకాలు..
* మీసర వాన – ఈ వర్షం మృగశిర కార్తెలో మాత్రమే కురుస్తుంది.
* దుబ్బురు వాన – తుప్పర/ తుంపరగా కురిసే వర్షాన్ని దుబ్బురు వాన అంటారు.ఈ పేరు ని మనం అందరము తరచుగా వినివుంటాం .
* బట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిపేంతగా వర్షం కురిస్తే దాన్ని బట్టదడుపు వాన అంటారు.
* సూరునీల్ల వాన – ఇంటి చూరు నుండి ధార లా వర్షం కురిస్తే దాన్ని సూరునీల్ల వాన అంటారు.
* గాంధారి వాన – కంటికి ఎదురుగా చెట్లు, వస్తువులు కనిపించనంతగా వాన కురిస్తే దాన్ని గాంధారి వాన అంటారు.
* మాపుసారి వాన – సాయంకాలం వేలల్లో కురిసే వానను మాపుసారి వాన అంటారు.
* సానిపి వాన – వాకిలి పై కళ్లాపి జల్లినట్టు గా కురిస్తే ఆ వాన ని సానిపి వాన అంటారు.
* తెప్పె వాన – ఒకే ప్రదేశంలో ఒక చిన్న మేఘం నుంచి వర్షం పడితే దాన్ని తెప్పెవాన అంటారు.
* సాలు వాన – రైతులు వ్యవసాయం మొదలు పెట్టేందుకు వీలుగా ఒక నాగలిసాలుకు సరిపడా వాన పడితే అది సాలువాన అని అంటారు .
* ఇరువాలు వాన – వ్యవసాయంలో రెండు సాల్లకు సరిపడా మరియు విత్తనాలు వేసేందుకు సరిపడా వాన కురిస్తే దాన్ని ఇరువాలు వాన అంటారు.
* మడికట్టు వాన – బురద పొలాన్ని దున్నేటంత జోరుగా వాన వస్తే దాన్ని మడికట్టు వాన అంటారు.
* ముంతపోత వాన – ముంత తోటి పోసినంత వాన వస్తే దాన్ని ముంతపోత వాన అంటారు.
* కుండపోత వాన – కుండతో కుమ్మరించినంత, ఎకధాటిగా వర్షాలు పడితే దాన్ని కుండపోత వాన అంటారు.ఈ పేరు ని కూడా మనం తరచుగా వినే ఉంటాము
* ముసురు వాన – వరుసగా మూడు, నాలుగు రోజులు ఏకధాటిగా విడువకుండా వనాలు కురిస్తే దాన్ని ముసురు వాన అంటారు
* దరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వానని దరోదని వాన అంటారు.
* బొయ్యబొయ్యగొట్టే వాన – గాలిదుమారంతో కురిసే వానని బొయ్యబొయ్యగొట్టే వాన అంటారు.
* రాళ్ల వాన – అకాలంగా రాళ్లతో కురిసే వానని వడగండ్ల వాన అంటారు.
* కప్పదాటు వాన – అన్ని ప్రాంతాల్లో కాకుండా అక్కడక్కడా కొంచెం కొంచెంగా కురిసే వానని కప్పదాటుడు వాన అంటారు.
* తప్పడతప్పడ వాన – ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులతో కాసేపు టపటపా కురిసే వానను తప్పడతప్పడ వాన అంటారు.
* దొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారే సరికి తగ్గిపోయే వానని దొంగవాన అంటారు.ఈ వాన ని తరచు గా పిల్లల దగ్గర వింటూవుంటాము
* కోపులునిండే వాన – రోడ్డు పక్కన గుంతలు నిండేలా కురిస్తే కోపులునిండేవాన అంటారు.
* ఏక్టార వాన – ఏకధారగా కురిసే వానను ఏర్ధార వాన అంటారు.
* మొదటి వాన – రైతులు విత్తనాలు నాటిన తరువాత విత్తనాలకు బలమిచ్చే వానను మొదటివాన అంటారు.
* సాలేటి వాన – భూమి తడిసేంతగా భారీగా వానలు పడితే సాలేటి వాన అంటారు.
* సాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన కురిస్తే సాలుపెట్టు వాన అంటారు.