ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. మనుషులతో పనిలేకుండా యంత్రాలే అన్ని పనులు చేయడంతో మానవవనరులపై దీని ప్రభావం పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు కూడా మొదలయ్యాయి. హాలీవుడ్ లో ఆందోళన తారాస్థాయికి చేరకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై నిషేధం విధించాలని, తమ భవిష్యత్ కు భరోసా కల్పించాలని కోరుతూ హాలీవుడ్ లో సిబ్బంది సమ్మెకు దిగారు.
నిరవధిక సమ్మెతో…
నిరవధిక సమ్మెను ప్రకటించారు. హాలివుడ్ కు చెందిన స్క్రీన్ యాక్టర్స్ గిల్ట్ సమ్మెకు దిగింది. అయితే వీరితో నిర్మాతలు జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో నిన్న అర్ధరాత్రి నుంచి నటులు సమ్మె బాట పట్టారు. దాదాపు 1.60 లక్షల మంది నటులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను నిరోధించాలంటూ రైటర్స్ గిల్ట్ గత పదకొండు రోజులుగా సమ్మెకు దిగింది. వారికి నటీనటులు కూడా తోడు కావడంతో హాలీవుడ్ దాదాపు సమ్మెలోకి వెళ్లినట్లయింది.
ఆగిపోయిన సినిమాలు …
వీరి సమ్మెతో హాలీవుడ్ లో సినీ ఇండ్రస్ట్రీ మూతబడినట్లయింది. ఈ సమ్మె కారణంగా నిర్మాతలు తీవ్ర నష్టపోయే అవకాశముందని చెబుతున్నారు. అనేక సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ ఆలస్యం కానుంది. కొన్ని భారీ సినిమాల విడుదల కూడా వీరి సమ్మెతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. నటీనటులు విడుదల కావాల్సిన సినిమా ప్రమోషన్ ను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో హాలీవుడ్ భారీ నష్టాన్ని చవి చూసే అవకాశముంది.