ఇజ్రాయెల్ లో అద్బుతం జరిగింది. రోడ్డు ప్రమాదంలో శరీరం నుంచి వేరుపడిన తలను ఒక బాలుడికి అతికించి అక్కడి వైద్యులు ఘనతను సాదించారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు చేసిన కృషికి ప్రశంసలు అందుతున్నాయి. మొండెం నుంచి వేరైన తలను అతికించి తిరిగి ప్రాణం పోసిన వైద్యులను దేవుళ్లుగా కొనియాడుతున్నారు. ఇజ్రాయెల్ లో జరిగిన ఈ ఘటన ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ ఈ వార్త వైరల్ గా మారింది.
కారు ప్రమాదంలో…
ఇజ్రాయెల్ లోని జోర్డాన్ వ్యాలీకి చెందిన సులేమాన్ హసన్ పాఠశాలలో చదువుతున్నాడు. ప్రతిరోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే సైకిల్ తొక్కేవాడు. సైకిల్ తొక్కడం అంటే హసన్ కు అత్యంత ఇష్టం కావడంతో తల్లిదండ్రులు అతనికి సైకిల్ కొని ఇచ్చారు. అయితే సైకిల్ పై బయటకు వెళ్లిన సులేమాన్ ను ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సులేమాన్ తల, శరీరం వేరయింది. వెంటనే స్థానికులు గమనించి సులేమాన్ ను ఆసుపత్రికి తరలించారు.
అరుదైన చికిత్స…
తల భాగం దాదాపు వేలాడుతున్న దశలో ఆసుపత్రికి చేరకున్న సులేమాన్ కు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రిలోని స్పెషలిస్ట్ డాక్టర్లంతా కలసి సులేమాన్ ను బతికించాలని నిర్ణయించుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడి తలను తిరిగి విజయవంతంగా అతికించగలిగారు. సర్జరీ చేసిన తర్వాత కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు సులేమాన్ పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. వైద్య శాస్త్రంలో ఇదొక అద్భుతమని అనేకమంది వైద్య నిపుణులు డాక్టర్స్ టీంను కొనియాడుతున్నారు. తమకు ఏకైక సంతానం సులేమాన్ ప్రాణాలను కాపాడినందుకు తండ్రి హసన్ వైద్యులందరినీ కలిసి ధన్యవాదాలు తెలిపారు. తన కుమారుడికి పునర్జన్మ ప్రసాదించారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.