టమాటా.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. టమాటా కొనాలంటే జనాలకు ఎంత కష్టమో… రైతులకు మాత్రం తన పంటను విక్రయించడం అంత సులువుగా మారింది. ఎగబడి టమాటాను కొంటున్నారు. డిమాండ్ కు తగినట్లుగా టమాటా దిగుబడి లేకపోవడంతో దేశ వ్యాప్తంగా టమాటా కిలో రెండు వందల రూపాయల వరకూ పలుకుతుంది. కొందరు కొనలేక టమాటాలను అరుదైన వస్తువుగా చూడాల్సి వస్తుంది. కాని రైతుల పంట మాత్రం పండుతుంది. టమాటా రైతు అంటే ఆ గౌరవం వేరు. ఒకప్పుడు టమాటా రైతు అంటే చులకనగా చూసేవారు. నేడు గౌరవం ఏ స్థాయిలో దక్కుతుందో చెప్పలేం.
జీవితాన్నే మార్చేసింది…
టమాటా ఒక రైతు జీవితాన్నే మార్చింది. కోటీశ్వరుడిని చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలో ఒక రైతు టమాటాను విక్రయించి కోటేశ్వరుడయ్యాడు. పూనే జిల్లా సమీపంలో భోగోజీ గయాకర్ అనే రైతు తన పన్నెండు ఎకరాల్లో టమాటాను వేశాడు. టమాటా దిగుబడి బాగానే వచ్చింది. టమాటా ధర కూడా ఎక్కువగా పలకడం, మార్కెట్ కు వెళ్లకముందే పొలానికి వచ్చి వ్యాపారులు కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో జరుగుతుంది.
1.50 కోట్లు…
మొత్తం ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 13,000 టమాటా బాక్సుల దిగుబడి వచ్చింది. ఒక్కొక్క టమాటా బాక్సును భోగోజీ గయాకర్ ఈ నెలలోనే 1.5 కోట్ల రాబడిని పొందారు. టమాటా తన ఇంటి అదృష్టాన్ని మార్చివేసిందని ఆయన అంటున్నారు. తాము ఈ ధరను ఊహించలేదని, టమాటాతో ఇంత లాభం వస్తుందని జీవితంలో కూడా అనుకోలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టమాటాను అమ్మి తక్కువ కాలంలో లక్షాధికారులయిన వారు లెక్కేలేదంటున్నారు వ్యాపారులు. మొత్తం మీద టమాటా కొందరి రైతుల జీవితాలను పూర్తిగా మార్చివేసింది.