రష్యా అతి పెద్ద దేశం… ఉక్రెయిన్.. చిన్న కంట్రీ… కానీ యుద్ధం మాత్రం నెలల తరబడి సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకోలేకపోతున్నాయి. అడుగడుగునా ఉక్రెయిన్ ఆర్మీ రష్యన్లను అడ్డుకుంటుంది. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేని పరిస్థితి. సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం కారణంగా ఇరు దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయినా ఇరు దేశాలు తెగించి పోరాడుతున్నాయి. థిక్కరించిన దేశాన్ని ఆక్రమించుకోవాలన్న ఉక్రోషంతో రష్యా, తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్ లు నిరంతరం పోరాడుతున్నాయి. ఈ పోరాటం ఆగేదెన్నడు…?
క్లస్టర్ బాంబులు…
అమెరికా నుంచి క్లస్టర్ బాంబులు ఉక్రెయిన్ కు చేరుకున్నాయి. ఇవి అతి ప్రమాదకరమైన బాంబులు. వీటితో విధ్వంసం తప్పదంటున్నారు. అయితే రష్యాకూడా తాము కూడా క్లస్టర్ బాంబులు వినియోగిస్తామని చెబుతోంది. దీంతో యుద్ధం మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రష్యా – ఉక్రెయిన్ లు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఏడాదికిపైగా కొనసాగుతున్న యుద్ధంతో ఇరు దేశాలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి.
ఏడాది దాటినా…
రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమయింది. ఇప్పటి వరకూ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరు దేశాలు హోరా హోరీ పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ ను త్వరగా ఆక్రమించుకోవాలన్న రష్యా కోరిక నెరవేరడం లేదు. తమ భూభాగంలో రష్యా పెత్తనాన్ని ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. దీంతో ఇరు దేశాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్తి నష్టం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. అయినా పరువు కోసం ఒకరు… పట్టుదలగా మరొకరు తెగించి పోరాడుతుండటంతో ఇరు దేశాల్లో ప్రజలు అసహనానికి గురవుతున్నారు.
ప్రపంచంపై కూడా…
ప్రజలే కాదు… రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచంపై కూడా పడుతుంది. నూనె, ఆయిల్ వస్తువుల ధరలు పెరగడం ఆందోళనకు తావిస్తుంది. నాటోలో చేరకుండా ఉండాలని రష్యా, తాము చేరితే తప్పేమిటని ఉక్రెయిన్ పట్టుదలకు పోవడం… పంతాలకు దిగడంతోనే యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ ప్రభావం ఇరు దేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రష్యాలోనూ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. యుద్ధం ముగించాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అంతర్జాతీయ సమాజం కూడా వత్తిడి తెచ్చింది. అయినా యుద్ధ విరమణకు అంగీకరించలేదు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు కూడా అసంపూర్తిగానే ముగియడంతో దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందా? అన్న ఉత్కంఠ అన్ని దేశాలకూ ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ చాలా వరకూ ఖాళీ అయింది. ఉక్రెయిన్ ను విడిచి అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు.
చిన్న దేశమైనా…
కాకుంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి. తెగించి రష్యా పై పోరాడుతున్నాడన్న ప్రశంసలు ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ.. ఆయన నిర్వాకం కారణంగానే యుద్ధం సంభవించిందనే వారు కూడా లేకపోలేదు. మొండితనాన్ని వీడకపోవడంతోనే రష్యా యుద్ధానికి దిగిందన్న వాదనలో కూడా నిజం ఉంది. అయితే జెలెన్ స్కీ ఒంటరి పోరాటాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయి. ఒంటిచేత్తో అతి పెద్ద దేశమైన రష్యాను ఆయన అడ్డుకుంటున్న తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భయపడకుండా… దేశం కోసం జెలెన్ స్కీ చేస్తున్న పోరాటానికి ఉక్రెయిన్ ప్రజల మద్దతు లభించడంతోనే సాధ్యమయిందంటున్నారు.
కామెడీ షోతో…
జెలెన్ స్కీ…. రాజకీయ వేత్త కాదు. ఆయన ఒక కామెడీ షోతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఫేమస్ అయి రాజకీయాల్లోకి వచ్చారు. అనుకోకుండా 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా గెలిచారు. అదీ 73 శాతం ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఆయనకు అంతకు ముందు ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ప్రముఖ టీవీ షో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ ను జెలెన్ స్కీ నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. మంచి వాగ్దాటి కలిగి ఉండటంతో జనానికి చేరువయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతగా జనంతో జెలెన్ స్కీ కనెక్ట్ అయ్యారు. అదే ఆయనకు అధ్యక్ష పదవికి చేరువ చేసింది.
దేశం కోసం…
అయితే జెలెన్ స్కీ యుద్ధం బూచి చూసి వెన్ను చూపి పారిపోలేదు. గతంలో కాబూల్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ అధ్యక్షుడు అష్రష్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. కానీ జెలెన్ స్కీ మాత్రం ధైర్యంగా దేశం కోసం నిలబడ్డారు. రష్యా దండయాత్రకు దిగిన వెంటనే ఆయన సైనిక దుస్తులను ధరించి యుద్ధంలో కూడా పాల్గొని సైనికులకు సపోర్ట్ గా నిలిచారు. ఉక్రెయిన్ ఆర్మీలో ధైర్యాన్ని నింపేందుకు జెలెన్ స్కీ తీసుకున్న నిర్ణయాలు పనిచేశాయనే చెప్పాలి. దూసుకొచ్చిన రష్యా బలగాలను నిలువరించేందుకు ఉక్రెయిన్ సైన్యం జరిపిన పోరాటం అసమాన్యం. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల నుంచి పెద్దగా సాయం లేకున్నా మొండిగా రష్యా బలగాలను ఎదుర్కొని ధీటుగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే దిశగా రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు.
అపార ఆస్తినష్టం…
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అపార ఆస్తి నష్టం సంభవించింది. ఉక్రెయిన్ వృద్ధి రేటు పదిహేనేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని ప్రపంచ బ్యాంకు సయితం అంగీకరించింది. ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా కలసి లెక్కలు వేశాయి. యుద్ధం ఆగిన తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు ఖర్చవుతుందన్న అభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయన్ పునర్నిర్మాణానికి, ఆ దేశం కోలుకోవడానికి 411 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని కూడా ప్రపంచ బ్యాంకు ప్రాధమికంగా అంచనా వేసింది. బాంబులతో మార్మోగిపోయిన ఉక్రెయిన్ లో కేవలం శిధిలాలను తొలగించడానికే ఐదు బిలియన్ డాలర్లు అవసరమని గుర్తించింది. అయితే ఈ నిధులను ఎక్కడి నుంచి ఉక్రెయిన్ సమకూర్చుకుంటుందన్నది మాత్రం ఎవరూ వెల్లడించలేదు.
కోలుకునే పరిస్థితి….
రష్యా దండయాత్ర కారణంగా యుద్ధం ఆగినా ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి. తిరిగి కోలుకోవాలంటే ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర దేశాల సాయం కూడా అవసరం. ఆ దిశగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ స్థూల జాతీయోత్పత్తి 29 శాతం తగ్గింది. లక్షలో సంఖ్యలో ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ, ప్రయివేటు వ్యాపార సంస్థలు మూత పడటంతో ఉపాధి అవకాశాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడుల కారణంగా ఆయిల్ పై కూడా పెను ప్రభావమే పడింది. రష్యా సేనలు ఇంధనకేంద్రాలతో పాటు ఎలక్ట్రిక్ గిడ్స్ పై దాడులు చేయడంతో కోలుకోలేని నష్టం వాటిల్లింది. ఇలా ఒక్కటేమిటి… అన్ని రంగాలు దెబ్బతినడంతో దేశాన్ని తిరిగి పునర్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వార్ తర్వాత…?
యుద్ధం చేయగానే సరిపోదు… రష్యా సేనలను సమర్థవంతంగా ఎదుర్కొన్నంత మాత్రాన వచ్చేది ఏమీ ఉండదు. యుద్ధం ముగిసిన తర్వాత తీసుకునే చర్యలే జెలెన్ స్కీకి సవాల్ గా మారనున్నాయి. దాదాపు పదిహేనేళ్ల పాటు వెనక్కు వెళ్లిన దేశాన్ని తిరిగి సజావుగా నడిపించగలగాలి. అందుకు ప్రత్యేకమైన ఆలోచనలు.. వ్యూహాలు అవసరం. జెలెన్ స్కీ అప్పుడే సరైన నేతగా గుర్తింపు పొందుతారు. అంతే తప్ప యుద్ధాన్ని నెలల పాటు కొనసాగించినంత మాత్రాన ఉక్రెయిన్ జనాలకు ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటి నుంచి జెలెన్ స్కీ ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నది అక్కడి ప్రజల మనసులో మాట. మరి జెలెన్ స్కీ ప్రయత్నాలు ఏ రకంగా ఉంటాయన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.