కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వనమా పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఇటీవల వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి అనర్హడంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తప్పుడు అఫడవిట్ ఎన్నికల సమయంలో పెట్టారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు వనమాపై అనర్హత వేటు వేసింది.
స్టే ఇవ్వాలంటూ..
అయితే సుప్రీంకోర్టు వెళ్లే వరకూ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. తాము ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని, స్టే ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులను తీసుకుని జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలసి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలని కోరారు.