తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. డిసెంబరులోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించే చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవే కావచ్చు. వచ్చే సమావేశాలను కొత్త ప్రభుత్వం నిర్వహించే అవకాశముంది. అంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని కాదు. వస్తే బీఆర్ఎస్ లేకుంటే వేరే పార్టీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ టర్మ్ కు మాత్రం బీఆర్ఎస్ నిర్వహించే చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవేనని చెప్పాలి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
ఆగస్టు 3 నుంచి…
ఆగస్టు మూడో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. నాలుగైదు రోజులు సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిసింది. ప్రధానంగా ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అవకాశాలున్నాయి.
ఎల్లుండి కేబినెట్ భేటీ…
దీంతో పాటు జులై 31న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు వరద ప్రాంతాల్లో నష్టపోయిన వారికి పరిహారం ఎంత ఇవ్వాలన్న దానిపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దెబ్బతిన్న రహదారుల నిర్మాణంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపుదలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.