గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయినా చంద్రబాబు వైఖరిలో అస్సలు మార్పు రాలేదు. అవే ఉపన్యాసాలు. జగన్ ప్రభుత్వంపై శాపనార్ధాలు. తప్పించి తాను పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాననే విషయాన్ని మరిచి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా మారింది. ఆయన పర్యటనతో పార్టీ నేతల్లో ఉత్సాహం తేవచ్చు. క్యాడర్ కొంత పరుగులు తీయొచ్చు. కానీ ఓటర్లు.. అదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల భయం. తాజాగా చంద్రబాబు నీటిపారుదల ప్రాజెక్టుల సందర్శనకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరారు.
హామీలు ఇచ్చినా…
ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగానే గ్యాప్ లేకుండా సీమలో తమ పార్టీ పట్టునిలుపుకునేందుకు ఆయన ప్రాజెక్టుల బాట పట్టారు. అంత వరకూ ఓకే. కానీ పథ్నాలుగేళ్లు తాను చేసింది ఏంటి? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు. తాను తిరిగి అధికారంలోకి వస్తే అది చేస్తా.. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఇస్తున్న హామీలను జనాలు కూడా లైట్ గా తీసుకుంటున్నారు. అంత సీమ మీద పేమే ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న పథ్నాలుగేళ్ల సమయంలో ఏం చేశావన్న ప్రశ్న వెనువెంటనే ఆయనకు తగులుతుండటమే ఇందుకు కారణం.
జనసమీకరణ సమస్య….
టీడీపీ స్థానిక నేతలకు జనసమీకరణ సమస్యగా మారింది. ఇటీవలే లోకేష్ పర్యటించి వెళ్లారు. ఆయన సభలు, పాదయాత్ర కోసం జనసమీకరణ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు రావడమే కాకుండా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వీటికి కూడా జనాన్ని తరలించడం తలకు మించిన భారంగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నయా పైసా కూడా రావడం లేదు. వ్యయం మొత్తం పార్టీ నేతలే భరించాల్సి వస్తోంది.
ఎంత వ్యయం…?
ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో టిక్కెట్ ఆశించే వారంతా తలో చెయ్యి వేసి చంద్రబాబు రోడ్ షోలను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరకు టిక్కెట్ వచ్చేది ఒక్కరికే. రాయలసీమలో గత ఎన్నికల్లో కేవలం మూడు నియోజకవర్గాల్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగిలిన నియోజకవర్గాల్లో నేతలందరూ అప్పులపాలయ్యారు. వారంతా ఈ వరస పర్యటనలతో చేతి చమురును వదిల్చికుంటున్నారు. ఇప్పుడే తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులు ఖాళీ అయిపోతే ఇక ఎన్నికల సమయంలో ఎలా అన్న ఆవేదన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. రెండేళ్ల ముందు నుంచే జరుపుతున్న అగ్రనేతల పర్యటన పార్టీకి, తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న ప్రశ్నను వారు సన్నిహితుల వద్ద వేస్తున్నారు. మొత్తం మీద నీటి ప్రాజెక్టుల పరిశీలన టూర్ కూడా వృధా ప్రయాసేనన్నది తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్న గుసగుపలు.