భారతీయ జనతా పార్టీ ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నేతలను శాసనసభ ఎన్నికల బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశానుసారం నేతలందరూ శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ముఖ్యమైన నేతలందరూ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయిపోతున్నారన్న టాక్ వినపడుతుంది.
ముందుగా అసెంబ్లీ…
తెలంగాణ శాసనసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలకంటే ముందు జరుగుతాయి. అందుకే పార్లమెంటు సభ్యుల నుంచి రాజ్యసభ సభ్యుల వరకూ ఎవరైనా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనన్న ఆదేశాలు అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో రాజ్యసభ సభ్యులకు కొంత మినహాయింపు లభించే అవకాశముంది. ఇటీవలే రాజ్యసభకు ఎంపికయిన కె.లక్ష్మణ్ కు మాత్రం మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. ఆయన శాసనసభకు పోటీ చేయాలంటే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, ఇది సరికాదన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది.
ప్రచారమేనంటూ…
ఇక పార్లమెంటు సభ్యులుగా ఉన్న వారు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. పార్లమెంటు ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సమయం కేవలం నెలలు మాత్రమే ఉండటంతో పోటీ చేయించాలని హైకమాండ్ భావించే అవకాశాలున్నాయి. అందుకే సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతుంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా దీనిపై ఇప్పుడు పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చ జరుగుతుంది. అయితే దీనిని ప్రచారంగానే కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇంకా అభ్యర్థులపై ఎలాంటి క్లారిటీ రాలేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా ఇలా ఉంది.
కిషన్ రెడ్డి – అంబర్ పేట్
బండి సంజయ్ – కరీంనగర్
సోయం బాపూరావు – బోధ్
ధర్మపురి అరవింద్ – ఆర్మూర్
ఈటెల రాజేందర్ – గజ్వేల్
రఘునందన్ రావు – దుబ్బాక
డీకే అరుణ – గద్వాల
జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు
మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి
ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్
వివేక్ – చెన్నూరు
విజయశాంతి – మెదక్
యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్
రామచంద్ర రావు – మల్కాజ్ గిరి
ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్
ఆచారి – కల్వకుర్తి
జయసుధ – సికింద్రాబాద్
మహేశ్వర్ రెడ్డి – నిర్మల్
రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్
పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం
బాబు మోహన్ – ఆందోల్
నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు
కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్
బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం
విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్
గరికపాటి మోహనరావు – వరంగల్
ఈటల జమున – హుజురాబాద్