కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయనను కేబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయమైంది. దీంతో ఆయన అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజవర్గ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ముందుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఈ మేరకు సిగ్నల్స్ రావడంతో కిషన్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా మారింది.
రెండుసార్లు ఎమ్మెల్యేగా…
కిషన్ రెడ్డి గతంలో అంబర్ పేట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన అంబర్పేట నుంచి గెలిచి శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం అంబర్ పేట్ ప్రజలు కిషన్ రెడ్డిని పక్కనపెట్టారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కాలేరు వెంకటేశ్ ను గెలిపించారు. అయితే గత ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో కిషన్ రెడ్డి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు…
అయితే భారతీయ జనతాపార్టీకి శాసనసభ ఎన్నికలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ప్రతి సీటు కీలకంగా మారనున్న తరుణంలో అంబర్ పేట్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన తాను ఈసారి ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇచ్చారని బీజేపీలో ప్రచారం జరుగుతుంది. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా కిషన్ రెడ్డి ప్రతిపాదనకు అంగీకరించిందని, అందుకోసమే ఆయనను రాష్ట్రానికి పంపిందని చెబుతున్నారు.
అంబర్పేట్ నుంచి…
ఖచ్చితంగా గెలిచే సీటు అంబర్ పేట్ ను మరొకరికి ఇవ్వడం ఎందుకని.. తిరిగి కిషన్ రెడ్డిని బరిలోకి దించాలని పార్టీ నాయకత్వం భావించింది. సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంటుకు జయసుధను ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు. అందుకే జయసుధ తాజాగా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెకు సికింద్రాబాద్ అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అంబర్ పేట్ నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కూడా కిషన్ రెడ్డి భావిస్తుండటంతో ఆయన పోటీ ఖాయమైందని తెలుస్తోంది. మరి ఈసారి ఆయనకు గెలుపు దక్కుతుందా? అన్నది చూడాల్సి ఉంది.