గత రెండు నెలలుగా జనాలను ఏడిపిస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు దిగివస్తుండటంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగానికి సగం ధరలు తగ్గాయి. మొన్నటి వరకూ కిలో రెండు వందల రూపాయల వరకూ పలికి టమాటా ధర నేడు వంద రూపాయలకు చేరుకుంది. అయితే కొనుగోళ్లు తగ్గడం, దిగుమతులు కూడా క్రమంగా పెరిగి పోతుండటంతో టమాటా ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్లో సగం ధరకు…
ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ లో నిన్నటి వరకూ 4,300 రూపాయలు పలికిన 23 కేజీల బాక్సు ధర నేడు సగానికి సగం పడిపోయింది. ప్రస్తుతం 2,300 రూపాయలకు చేరుకుంది. కొన్ని బాక్సులు పదిహేను వందలు కూడా పలుకుతున్నాయి. దీంతో కిలో టమాటా ధర ప్రస్తుతం వంద రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో నేరుగా కాలనీలకు వచ్చి కిలో వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. గత రెండు నెలలుగా టమాటాతో మొహం మొత్తిన జనం ఇప్పుడిప్పుడే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎగుమతులు తగ్గి…
రానున్న కాలంలో టమాటా ధర మరింత దిగిపోయి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఉత్తర భారత దేశానికి ఎగుమతి అవుతున్న టమాటా అక్కడకు అందుబాటులోకి రావడంతో ఎగుమతులు కూడా నిలిచిపోయాయంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు ఎగుమతి అయ్యే టమాటా ప్రస్తుతం నిలిచిపోయింది. దీంతో టమాటాను పండించి కోటీశ్వరులవుదామనుకుంటున్న రైతులు నిరాశలోకి వెళ్లపోయారు. ఉత్తర భారతదేశంలోనూ టమాటా దిగుబడి రావడంతోనే ఎగుమతులు నిలిచిపోవడంతో అక్కడ కూడా ధర తగ్గింది. రానున్న రోజుల్లో టమాటా ధర మరింత తగ్గే అవకాశాలున్నాయి. వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్ కాక మరేమిటి?