సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఊరల లభించింది. అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు వనమా పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫడవిట్ సమర్పించారన్నది ఆయన అభియోగం.
నాలుగు వారాలకు…
అయితే దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించింది. తనకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలన్న పిటీషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది. అయినా వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారించిన సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.