(modi)
ఎన్నికల వేళ అధికారంలో ఉన్న అన్ని పార్టీలూ ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరోసారి అధికార పీఠం ఎక్కేందుకు కసరత్తులు అందరూ చేస్తున్నారు. రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకూ ఎవరూ దీనికి అతీతం కాదు. అధికారంలో ఉన్న పార్టీకి అదే అడ్వాంటేజీ. తాము అనుకున్న పథకాలను వెంటనే అమలు పర్చే వీలుంటుంది. తమ ఓటు బ్యాంకును పెంచుకునే వీలుంటుంది. తమ పాలనపై ఉన్న అసంతృప్తిని తొలగించుకునేందుకు అధికార పార్టీకి అనేక పథకాలు ఎన్నికల సమయంలో ఉపయోగపడతాయి. 2024 అంటే వచ్చే ఏడాది.. మరికొద్ది నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార బీజేపీ సయితం ప్రజలను ఆకర్షించే పలు పథకాలను ప్రకటిస్తూ ముందుకు వెళుతుంది.
విశ్వకర్మ పథకానికి…
అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు పదిహేనోతేదీన ప్రధాని మోదీ ప్రకటించిన పలుపథకాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతి వృత్తులు చేసుకునే వారికి రెండు లక్షల రూపాయల రుణాలను అందివ్వ నుంది. అందుకోసం భారత ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. దీంతో పాటు మరికొన్ని నిర్ణయాలను కూడా కేంద్ర మంత్రి మండలి తీసుకుంది. విశ్వకర్మ పథకం కింద శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ తీసుకునే వారికి రోజుకు ఐదు వందల రూపాయలు స్టయిఫండ్ గా చెల్లిస్తారు. అనంతరం వారి వృత్తులకు సంబంధించి పరికరాల కొనుగోలు కోసం రెండు లక్షల రూపాయలు చెల్లిస్తారు. దాదాపు 30 లక్షల మందికి తొలి విడతగా ఈ పథకం కింద చేయూతనివ్వాలని నిర్ణయించింది. సెప్టంబరు 17 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.
ఈ బస్ లు… (modi)
దీంతో పాటు మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంది. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకానికి కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత్ లో తొలి విడతగా పదివేల ఈ-బస్ లను పంపాలని నిర్ణయించింది. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ బస్సులను నిర్వహిస్తాయి. మొత్తం 169 నగరాల్లో ఈ-బస్ లను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 77,613 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు లక్షల జనాభా కంటే ఎక్కువగా ఉన్న పట్టణాలకు ఈ-బస్సులను కేటాయించనన్నారు. దీనివల్ల రవాణా ఛార్జీలు కూడా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. కాలుష్య నివారణ కోసం కూడా ఇవి దోహదం చేస్తాయి.
ఏపీ తెలంగాణకు…
ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 2,339 కిలోమీటర్ల మేరకు రైల్వే లైను విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీంతో పాటు డిజిటల్ ఇండియా పథకాన్ని కూడా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం 14,903 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఐటీ ఉద్యోగులు తమ స్కిల్ ను మెరుగుపర్చుకునేందుకు, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రజామోదం పొందుతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. (modi)