ప్రతి ఇంటి వంటింట్లో అవసరమైనది టమాటా (Tomato) . ఉల్లి. ఈ రెండు లేకపోతే ముద్దదిగే అవకాశం లేదు. టమాటాను ఇష్టపడని వారుండరు. టమాటాను వినియోగించని ఇల్లు ఉండదు. టమాటాకు అంతటి ప్రాధాన్యత ప్రతి ఇంట్లో ఉంటుంది. టమాటా లేకపోతే గృహిణుల చేతులు ఆడవు అంటారు. అలాంటి టమాటా గత కొద్ది రోజులుగా చుక్కలు చూపించింది. కిలో రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకూ పలికింది. టమాటాను కొనుగోలు చేయలేక అనేక మంది దాని వాడకాన్నే రెండు నెలల నుంచి మానేశారంటే అతిశయోక్తి కాదు. నోరూరిస్తున్నా జేబులు ఖాళీ అవుతాయని భయపడి టమాటాకేసి చూడటానికే జంకే వారు.
భారీ వర్షాలు.. దిగుబడి…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కావడం, దిగుమతి తగ్గడంతో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రైతులకు ఇది లాభదాయకమే. టమాటా పంటను వేసి అనేక మంది రైతులు కోట్లకు పడగలెత్తారు. ఒకప్పుడు టమాటాను వీధుల్లో పారబోసిన సంఘటనలు చూశాం. కిలో రూపాయికి కూడా కొనుగోలు చేయకపోవడం, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పశువులకు మేతగా వాటిని వినియోగించిన సందర్భాలు అనేకం చూశాం. టమాటా వేసి నష్టపోయిన రైతులు కోకొల్లలు. ఇక టమాటా వేయబోమని, అది నష్టం తెచ్చి పెట్టే పంట అని అనేకమంది రైతులు టమాటా పంట వేసేందుకు కూడా వెనుంకజ వేశారు.
విపరీతంగా పెరిగి… (Tomato)
కానీ గత కొద్ది నెలలుగా టమాటా ధర విపరీతంగా పెరగడం, దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో కోట్లు వచ్చిపడటంతో టమాటా రైతుల పాలిట వరంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కొందరు రైతులు రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారంటే మామూలు విషయం కాదు. టమాటా వారి ఇళ్లలో ఆనందాన్ని పంచి పెట్టడమే కాకుండా జీవిత కాలం చేసిన అప్పులన్నింటినీ తీర్చి వేసిందని అనేక మంది రైతులు బాహాటంగానే చెబుతున్నారు. టమాటా ధరలు పెరగడంతో కొందరు తాత్కాలికంగా దాని వాడకాన్ని కూడా నిలిపేశారు. పలు చోట్ల వ్యాపారులు అధిక ధరకు టమాటాను కొనుగోలు చేసి మార్కెట్ కు తీసుకు వచ్చి వినియోగదారులు కొనుగోలు చేయకపోవడంతో వీధుల్లో పారేయాల్సిన పరిస్థితిని అనేక చోట్ల చూశాం.
అటు వైపునకు ఎగుమతి…
ఉత్తర భారతంలో భారీ వర్షాలు నమోదు కావడంతో టమాటాలను అక్కడకు కూడా మనోళ్లు ఎగుమతి చేశారు. దీంతో మనకు టమాటా దొరకడం దుర్లభమమయింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఉన్న దిగుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అనేక మంది టమాటా రుచి చూడకుండానే దానిని వదిలేసిన పరిస్థితిని కూడా మనం చూశాం. అలాంటి టమాటా ఎప్పుడు తగ్గుతుందా అని ప్రతి మహిళ ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. కానీ ఇన్నాళ్లకు.. ఇన్ని నెలలకు టమాటా ధరలు దిగి వచ్చాయి. సామాన్యులకు కూడా ధరలు అందుబాటులోకి వచ్చాయి.
అందుబాటులోకి… (Tomato)
టమాటాతో లాభాలు బాగా పెరగడంతో తర్వాత సీజన్ లో అందరూ ఎగబడి టమాటా పంటను వేయడంతో దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో రెండు వందల రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు పూర్తిగా దిగివచ్చింది. కిలో ముప్ఫయి నుంచి నలభై రూపాయలకు బయట మార్కెట్ లో లభిస్తుండటంతో కొనుగోలు దారులు టమాటాను ఎగబడుతున్నారు. మదనపల్లి మార్కెట్ లో అయితే ధర మరింత తగ్గడంతో రైతులు మాత్రం నిరాశలో ఉన్నారు. వినియోగదారులు మాత్రం టమాటా ధరలు తగ్గడం పట్ల కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా లేని జిహ్వచాపల్యాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నారు. టమాటాతో అన్ని రకాల వంటలతో ఇప్పుడు వంటిల్లు ఘుమఘుమ లాడిపోతుంది. టమాటా ధరలు మరింత తగ్గే అవకాశముందని చెబుతున్నారు.