నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా (US) అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ఉత్కంఠతతోనే కొనసాగుతాయి. రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య హోరా హోరీ యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తాయి. ఎవరు అధ్యక్షుడయితే మనకు లాభం?అన్న లెక్కలు వేసుకుంటాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చూపనుండటంతో అనేక దేశాలు ఎవరు గెలిస్తే తమ దేశానికి అనుకూలం? ఎవరయితే వ్యతిరేకం అని బేరీజు వేసుకుని తమ ప్రాంత పౌరులకు పరోక్షంగా సంకేతాలు కూడా ఇస్తాయి. అందుకే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎవరూ అంత తేలిగ్గా తీసిపారేయలేరు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు కూడా అందరి మద్దతును పొందేందుకు ప్రయత్నాలు చేస్తారు. విజయం కోసం చివరి నిమిషం వరకూ ఎవరినీ వదలరు.
ఎన్నికల వేడి..
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలయింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. పార్టీలు తమ అనుకూలురు నుంచి వచ్చే మద్దతును బట్టి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ట్రంప్ మరోసారి పోటీ పడి తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలనుకుంటున్నారు. పారిశ్రామికవేత్త అయిన ట్రంప్ గతంలో అధికారంలో ఉండగా అనేక కేసుల్లో కూరుకుపోయారు. అయినా ఆయన పట్టుదలను ఏమాత్రం విడువకుండా అభ్యర్థిగా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
రిపబ్లికన్ పార్టీ నుంచి… (US)
రిపబ్లికన్ పార్టీ నుంచి ఈసారి అత్యధిక మందిపోటీ పడుతున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి ఒకరు. అందరిలోనూ అతి చిన్న వయసున్న రామస్వామికి మద్దతు పెరుగుతుంది. వివేక్ రామస్వామి వయసు ముప్ఫయి ఏడు సంవత్సరాలు. 2024 జనవరిలో జరగనున్నరిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రామస్వామి తల్లిదండ్రులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు. వారు చాలా రోజుల క్రితం అమెరికాకు వలస వచ్చిస్థిరపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు పోటీ పడటం సహజమే. ఈసారి ట్రంప్ ను ఎదుర్కొని ఎవరు రిపబ్లిక్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగానే ఉంది.
తనను వ్యతిరేకించినా…
వివేక్ రామస్వామి వ్యాపారవేత్తగా పేరుపొందారు. అయితే తాజాగాఆయన టెస్లా సీఈవో, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మద్దతు ప్రకటించారు. ఆయన సరైన అభ్యర్థి అని మస్క్ ట్వీట్ చేయడంతో ఆయనకు మద్దతిచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ఫీల్డ్ లో రెండో స్థానానికి చేరువలో రామస్వామి నిలవడంతో ఆయనకు ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు మద్దతు తెలుపుతున్నారు. రిపబ్లికన్ నాయకులు కూడా రామస్వామి అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతున్నారు. వివేక్ రామస్వామికి ఇప్పటికే తొమ్మిది శాతం రిపబ్లికన్ నేతల మద్దతు ఉంది. డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ సౌంటీస్ ను తోసి రాజని వివేక్ రామస్వామి ముందుకు రావాల్సి ఉంటుంది. గతంలో వివేక్ రామస్వామి ఎలన్ మస్క్ ను విమర్శించారు. మస్క్ చైనా విదేశాంగ మంత్రిని కలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా మస్క్మ్ మాత్రం వివేక్ కు తన మద్దతును ప్రకటించారు. వివేక్ నమ్మకమైన అభ్యర్థి అంటూ ఎలాన్ మస్క్ అన్నారు. వివేక్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. (US)