ISRO: చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకోవడానికి భారత్, రష్యాలు చంద్రయాన్ – 3 (Chandrayan – 3) మరియు లూనా – 25 (Luna – 25) అంతరిక్ష నౌకలను లాంచ్ చేసాయి. ఈ రెండు అంతరిక్ష నౌకలు ఆగెస్ట్ 21, 23 వ తేదీలలో చంద్రుడి దక్షిణ ధ్రువం పై ల్యాండ్ కావాల్సి ఉన్నాయి. అయితే ఆగెస్ట్ 18న లూనా – 25 అంతరిక్ష నౌకను చంద్రుడి కక్షలోకి తీసుకు రావడానికి రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ (ROSCOSMOS) చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. లూనా 25(Luna 25) నౌకతో తిరిగి సంప్రదింపులు జరపడానికి ఆగెస్ట్ 19 మరియు 20వ తేదీలలో చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటన విడుదల చేసింది. 2019లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 మరియు ఇప్పటి లూనా – 25 ప్రయోగాల విఫలంతో చంద్రుడి దక్షిణ ధ్రువం పై లాండింగ్ ఎంత కష్టమో తెలుపుతుందని అంతరిక్ష నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
1976 తర్వాత రష్యా తొలి ప్రయోగం
ఇప్పటి వరకు చంద్రుడి పైన 20 కంటే ఎక్కువ సార్లు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష నౌకలు విజయవంతంగా ల్యాండింగ్ చేసాయి. అయితే ఇక్కడ గమనించాల్సి విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలలో కేవలం మూడు చైనీస్ అంతరిక్ష నౌకలు మాత్రమే చంద్రుడి పై సేఫ్ ల్యాండింగ్‌లు చేయగలిగాయి.చంద్రునిపై మిగిలిన 17 విజయవంతమైన ల్యాండింగ్లన్నీ 1966 మరియు 1976 సంవత్సరాల మధ్యనే జరిగాయి.
రష్యా కు చెందిన లూనా-2 అంతరిక్ష నౌక మొదటి సారిగా 1959లో చంద్రుడి ఉపరితలంకు చేరుకొని రికార్డు సృష్టించగా ఆ తర్వాత 1966లో, రష్యాకే చెందిన లూనా-9 ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా చంద్రుని పై విజయ వంతమైన ల్యాండింగ్‌ని చేసింది. దాదాపుగా 50 సంవత్సర సుదీర్ఘ సమయం తర్వాత రష్యా చంద్రుని పైకి ఆగెస్ట్ 11న లూనా – 25 ను ప్రయోగించింది. ఈ నౌక జులైలో ఇస్రో చంద్రుడి దక్షిణ ధ్రువం పై ల్యాండింగ్ కి ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే రెండు రోజుల ముందే ఆగెస్ట్ 21న చంద్రుడి పై ల్యాండ్ కావాల్సి ఉండగా విఫలమైంది
గడ్డ కట్టే మంచు.. అంతు లేని చీకటి
భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక రష్యా యొక్క లూనా 25(Luna 25) నౌక కంటే చాల ఎక్కువ పే లోడ్ ఉండడంతో రష్యా నౌక కన్నా లేటుగా చందుని పైకి చేరుకోవాల్సి వస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం పై సూర్య రశ్మి లేకపోవడంతో (Dark Side Of Moon) అక్కడి ఉష్ణోగ్రతలు దాదాపుగా -300 డిగ్రీల ఫారెన్ హీట్ తో గడ్డ కట్టే చలితో పాటుగా కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి అంతులేని అంధకారంలో ఉంది. అయితే ఆ అంతులేని చీకటిలోనే మానవాళికి ఉపయోగపడే విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లూనా 25 విఫలం కావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల చూపంతా చంద్రయాన్ 3 పైనే ఉంది. ఇప్పటికే చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యూల్ యొక్క కక్షను విజయ వంతంగా తగ్గించామని, ఇక ఆగెస్ట్ 23 వ తేదీన సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యూల్ ను చంద్రుని దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ చేయనున్నామని ఇస్రో ప్రకటించింది.