L 1
అందరాని చందమామను జయించిన ఉత్సాహం ఇస్రో జోరు పెంచింది. కొత్త ప్రాజెక్టుల వైపు చూసేలా చేస్తోంది. చందమామపై పట్టు సాధించిన భారత అంతరిక్ష రంగం ఇప్పుడు సూర్యుని వైపునకు గురి పెట్టింది. సోలార్ మిషన్ ప్రారంభానికి మరో వారంలో ముహూర్తం పెట్టేసింది. సెప్టెంబర్ 2న సూర్యుని పై అధ్యయనానికి మరో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతోంది.ఆదిత్య- L1 స్పేస్ క్రాఫ్ట్ సూర్యుని బాహ్యవలయమైన కొరోనాను, సౌరమండలంలో గాలులను అధ్యయనం చేస్తుంది. భూమికి 1.5మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని స్టడీ చేసేందుకు ఆదిత్య -L 1 మిషన్ బయల్దేరుతోంది. బెంగుళూరులోని స్పేస్ ఏజెన్సీ నుంచి లాంచ్ చేసే తొలి స్పేస్ మిషన్ ఈ అధ్యయనాన్ని చేపడుతోంది.
మొత్తం 7 పేలోడ్స్ తో అధ్యయనం
చందమామ పై అధ్యయనానికి 5పేలోడ్స్ వినియోగించగా, సౌర మండలం బాహ్య వలయం L1 ను అధ్యయనం చేసేందుకు వెళ్లే ఈ మిషన్ కు 7 పేలోడ్స్ ఉంటాయి. సౌరమండలంలోని ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, సూర్యుని బాహ్యవలయం అయిన కొరొనా ను వేర్వేరు బ్యాండ్ వేవ్స్ తో పరీక్షించి అధ్యయనం చేస్తుంది. ఆదిత్య L1 పూర్తిగా దేశీయ పరిజ్నానంతో రూపొందిన మిషన్. ఇందులో ఎన్నో జాతీయ సంస్థల క్రుషి ఉంది. సూర్యునినుంచి వెలువడే ధూళి కణాల కొరొనా గ్రాఫ్ ను, అధ్యయనం చేసే పేలోడ్ ను బెంగళూరుకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎస్ట్రో ఫిజిక్స్ సంస్థ రూపొందించింది.సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజర్ (అంటే సూర్యునినుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను) అధ్యయనం చేయడానికి పూనేకు చెందిన ఆస్ట్రానమి యూనివర్సిటీ సెంటర్ పేలోడ్ ను తయారు చేసింది.
సూర్యుడి బాహ్య వలయం ప్రాథమిక అంచనా..
ఇక కొరొనా లేయర్ ను, క్రోమో స్ఫియర్ ను అధ్యయనం చేయడానికి ఆదిత్య L1 మిషన్ లోని యూవీ పేలోడ్స్ పని చేస్తాయి. అలాగే కిరణాలనుంచి వెలువడే దుమ్ము, దూళి కణాలను ఎక్స్ రే పేలోడ్స్ అధ్యయనం చేస్తాయి. L1 చుట్టూ ఉండే ధూళి కణాలు,అణువులు, అయస్కాంత క్షేత్రాన్ని మేగ్నటో మీటర్ పే లోడ్ స్టడీ చేస్తుంది. బెంగళూరులోని యూఆర్ రావు ఉప గ్రహ కేంద్రంనుంచి ఈ శాటిలైట్ ను రెండు వారాల క్రితమే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి తరలించారు. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 2న ఈ మిషన్ ను ప్రారంభిస్తామని ఇస్రో ప్రకటించింది.
సౌర జ్వాలల పైనా అధ్యయనం L 1
సూర్యుడి బాహ్యవలయం లోని హాలో కక్ష్యలోకి దీనిని ప్రయోగిస్తారు. సౌరమండల బాహ్య కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరం సూర్యుని పరిశీలిస్తుంటుంది. ఇది సౌర కార్యకలాపాల అధ్యయనమే కాదు.. అంతరిక్షంలో వాతావరణాన్ని రియల్ టైమ్ ఎఫెక్ట్ తో కొలుస్తుంది. L1 పాయింట్ నుంచి నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యుని అధ్యయనం చేస్తుండగా మిగిలిన మూడు సూర్యుని బాహ్య వలయంలోని అణువులు, దుమ్ము, ధూళి కణాలను అధ్యయనం చేస్తాయి. అప్పుడే సూర్యుని కి సంబంధించిన సమాచారం తెలిసే వీలుంటుంది. కొరోనల్ హీటింగ్, కొరొనానుంచి పైకి ఎగజిమ్మే ధూళి కణాలు, అగ్నిగోళం మండేందుకు ముందు, సౌర జ్వాలలు ఎగజిమ్మేటప్పుడు వాటి లక్షణాలు, సౌరమండల వాతా వరణం, అన్నింటినీ ఆదిత్యL1 మిషన్ కూలంకషంగా స్టడీ చేస్తుంది. సౌరమండలంలో ఉష్ణోగ్రతలు, గమనవేగం, సాంద్రత, అంతర్, బాహ్య వలయాల మధ్య తేడాలు, సూర్యగోళంలో అప్పుడప్పుడు రేగే మంట లకు కారణం, అయస్కాంత ప్రభావాలు, సౌర గాలుల వేగం, తీవ్రత, గాలివాటు అన్నింటినీ అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1ను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కొంచెమైనా పురోగతి సాధిస్తే..ఇస్రో మరో మైలురాయిని సాధించినట్లే.. మొత్తం అంతరిక్షం పై పట్టు వచ్చేసి నట్లే..