(Back Pain)
పొలం పనులు చేసుకునే రైతులు.., బరువులు మోసే కూలీలు.. ఇంతకుముందైతే నడుంనొప్పికి కేరాఫ్ అడ్రస్లు వీళ్లు. ఇప్పుడు మాత్రం నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్వేర్ ఉద్యోగి లేడు. ఎక్కువ సేపు కదలకుండా ఒకే భంగిమలో కూర్చుని ఉండడం, ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. ఎక్కువ మంది భుజాలు జార్చి కూర్చుంటుంటారు. కాని కూర్చున్నా, నిల్చున్నా వెన్ను నిటారుగా ఉంచాలి. ఇటీవలి కాలంలో నడుమునొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా పోయింది. యువతలో జీవనశైలి కారణమైతే చిన్న పిల్లల్లో కూడా నడుము నొప్పి రావడానికి మాత్రం స్కూల్ బ్యాగులే కారణం అని చెప్పాలి. కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఎముకల సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ నొప్పులు రావొచ్చు. ఇక వయసు పెరిగిన వాళ్లలో ముఖ్యంగా ఆడవాళ్లలో కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరొసిస్ సమస్య వస్తుంది.
ఈ మధ్య కాలంలో యవతలో వెన్ను నొప్పికి (Back Pain) మూలకారణం జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేయడమేనని నిపుణులు అంటున్నారు. రోజువారీ పనులను చేసేటప్పుడు, జిమ్ లో గంటల తరబడి వ్యాయామలు చేసినప్పుడు వెన్నుపై అనవసర ఒత్తిడి పడటంతో వెన్నునొప్పి సమస్య తలెత్తే అవకాశం ఉంది. మనం నించునే భంగిమలో సరిగా నించోకపోవడంతో వెన్నుపై యాభైశాతం ఎక్కువ ఒత్తిడి పడే అవకాశముంది.
వేధించే వెన్నునొప్పికి కారణాలెన్నో… (Back Pain)
మనలో చాలా మందికి స్మోకింగ్ వలన ఊపిరితిత్తులు పాడవుతాయన్న విషయం తెలిసినదే. ఐతే, స్మోకింగ్ అనేది వెన్నుసమస్యలను కూడా తీసుకువస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి, స్మోకింగ్ కు దూరంగా ఉండటం వలన కూడా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.వెన్నునొప్పి సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం ద్వారా దీర్ఘకాల సమస్యగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. దాంతో, సర్జరీల వైపు వెళ్ళాల్సిన అవసరం పడదు.
డిప్రెషన్ ఉన్నా..వెన్నునొప్పి (Back Pain)
ఒక్కోసారి వెన్నునొప్పికి (Back Pain) డిప్రెషన్ కూడా కారణమే. కాబట్టి ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటివి వెన్నునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి, మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అని వైద్యులు చెబుతున్నారు. వెన్నునొప్పికి సరైన మందు వ్యాయామమేనని గుర్తించాలి. నడక వంటి చిన్నపాటి వ్యాయామాలు వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. ఐతే, పరిస్థితిని బట్టి ఈ వ్యాయమాలుండాలి. పరిమితంగానే వ్యాయామం చేయాలి. గార్డెనింగ్ వంటి ఎక్కువ బరువులు మోయడం లాంటి పనులకు దూరంగా ఉండటం మంచిది.
నిద్రలేమి కూడా కారణమే
నిద్రలేమి కారణంగా నడుము నొప్పి తీవ్రం అయ్యే అవకాశం ఉంది. పెద్దవారికి సాధారణంగా రాత్రి పూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన నిద్ర కోసం, నడుము నొప్పి తగ్గించడానికి సరైన నిద్ర అవసరం.మనం నిద్రపోయేప్పుడు నడుము కింద దిండు పెట్టుకుంటే నడుము మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.అసలు ఏ పనుల వల్ల నడుం నొప్పి ఎక్కువగా వస్తుందో గమనించి వాటికి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తే వెనకాల సపోర్టు ఉండాలి. గంటకోసారి లేచి, అటూ ఇటూ నడవాలి. లేకుంటే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.వీటికి తోడు డాక్టర్ సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకోవడం, విటమిన్ డి ఇంజెక్షన్లు, క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం చేస్తుండాలి. ఒకవేళ ఊబకాయం సమస్య ఉంటే తగిన ఆహార నియమాలు కూడా పాటించాలి.