ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN) అరెస్టు వెనక ఎవరైనా అజ్నాత నేత హస్తముందా? టీడీపీ అధ్యక్షుడిగా ఇన్నాళ్లూ చక్రం తిప్పిన చంద్రబాబు(CBN) ఇప్పుడు జైల్లో కూర్చోడంతో టీడీపీ సానుభూతి పరుల మతిపోయింది. ఇన్నాళ్ల దాకా చంద్రబాబు అంటే తప్పు చేయరు.. చేసే వీలు లేదు… తప్పు ఏదైనా చేస్తే అది జగన్ చేస్తారు.. అలాగే ఏ తప్పు జరిగినా వెనకాల జగన్ హస్తం ఉండి ఉంటుందనే విధంగా జనం మైండ్ సెట్ మార్చడంలో కొన్నిమీడియా సంస్థలు సక్సెస్ అయ్యాయి. చంద్రబాబు తప్పు చేయరు.. చేసినా తప్పించుకోగలరు. ఇప్పటి వరకూ ఇదే మైండ్ సెట్ టీడీపీ శ్రేణులలోనే కాదు, టీడీపీ సామాజిక వర్గపు సామాన్యులలో కూడా ఉంది. ఆయనెప్పుడూ చట్టానికి దొరికే తప్పు చేయరు కాబట్టి ఆయన కరెక్ట్.. అనే ఆలోచనే జనానికి ఉండేది నిన్నటి వరకూ..
కానీ ఆ ధీమాను పటాపంచలు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి తల్లకిందులైంది. ఇప్పుడాయన బెయిల్ కోసం పోరాడుతున్నారు.. హై కోర్టులో బెయిల్ రావచ్చు గాక.. కానీ ఆయన ప్రభుత్వాధిపతిగా పొరపాటు నిర్ణయం తీసుకున్నారన్న విషయం… దాని పర్యవసానమే ఆయన జైలుకు వెళ్లడం అన్నది సామాన్య జనానికి సైతం అర్ధమైపోయింది. ఈ ప్రభుత్వంలోనూ వాళ్ల వేగులు ఉంటారు కాబట్టి అరెస్టపై కొంత ముందస్తు సమాచారం కూడా ఉండి ఉండొచ్చు. అయితే ఎలాగైనా బయటపడిపోతాననుకున్న ఆయన అంచనా మాత్రం తప్పయింది. తనకు ఏదో రోజు ఈ పరిస్థితి వస్తుందని ఆయన ఊహించే ఉంటారు. అందుకే నంద్యాల సభలో తనను అరెస్టు చేయచ్చునంటూ ముందే జనాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేశారు.
జగన్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం
నిజానికి టీడీపీ అవినీతిపై అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామని జైలుకు పంపుతామని వైసీపీ ప్రకటించింది. అధికారం చేపట్టి నాలుగేళ్లయినా ఆ ఆరోపణలను ఒక్కటీ నిరూపించలేకపోయిందని టీడీపీ ఎద్దేవా చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనా, రాజధాని నిర్మాణంపైనా, ఇతరత్రా కేసుల్లోనూ సీఐడీ విచారణ పేరుతో హడావుడి చేయడం తప్ప కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ వైసీపీ చూపెట్టలేకపోయింది. దాంతో టీడీపీ చెలరేగిపోయింది. అసలే చంద్రబాబు .. ఆపై వ్యవస్థలను మేనేజ్ చేసే ఆయన సమర్ధత తెలిసిన వారు కాబట్టి ఆయన్ను రైట్ టైమ్ లో దెబ్బ తీసేందుకు వైసీపీ ఇంత సమయం తీసుకుని ఉండొచ్చు.
అదనుకోసం చూశారా…
జగన్ ప్రభుత్వాన్ని హద్దులు మీరి మరీ టీడీపీ, జనసేన కలసి వినలేనంత దారుణమైన పదజాలంతో తిట్టడం అందరూ చూశాం.. అంతా రాజకీయ వేడి అనుకున్నాం.. వైసీపీ ఈ వ్యాఖ్యలపై పెద్దగా కౌంటర్ ఇచ్చి హడావుడి చేయలేదు. ఆ వ్యూహాత్మక మౌనం వెనక భారీ స్కెచ్ ఇదే అయి ఉంటుందనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.
చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి పూర్తి ఆధారాలు దొరికాక మాత్రమే.. అవీ చట్టానికి చెల్లుబాటు అయ్యే సాక్ష్యాధారాలు దొరికే వరకూ చాలా గోప్యంగా వ్యవహరించారన్నది వాస్తవం. అసలు క్లూ దొరకగానే అదను చూసి చంద్రబాబును పట్టుకున్నారు.
అత్యంత పకడ్బందీగా అడుగులు
మొత్తం వ్యవహారం జరుగుతున్న సమయంలో జగన్ లేరు. లండన్ లో కుమార్తె దగ్గరకు వెళ్లారు. ఆయన లేని టైమ్ లో ప్రభుత్వ వర్గాలే ఒక్క చిన్న తేడా కూడా జరగకుండా అతి జాగ్రత్తగా చంద్రబాబును దొరకబుచ్చి జాగ్రత్తగా, మర్యాదగా జైలుకు పంపగలగడం వైసీపీ ప్లానింగ్ కు నిదర్శనం.మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గౌరవంగా, మర్యాదగా హెలికాప్టర్ లో తరలిస్తామని అధికారులు చెప్పినా..రోడ్డు మార్గం ద్వారా అయితే టీడీపీ శ్రేణుల సానుభూతి సంపాదించొచ్చన్న ఉద్దేశంతో చంద్రబాబు రోడ్డు మార్గంద్వారానే విజయవాడ చేరుకున్నారు. ఆయన ఊహించినట్లు అడుగడుగునా..ప్రజలు సానుభూతి ప్రకటిస్తారనుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయి.
యువగళానికి చెక్ (CBN)
దీంతో ఎన్నికల ముంగిట్లో గెలుపుకోసం వ్యూహాలు పన్నుతున్న టీడీపీ ప్లాన్ తల్లకిందులైంది. తండ్రీ, కొడుకు భాషా సంస్కారం, మర్యాద మరచి చేసిన వ్యాఖ్యలు పరాకాష్టకు చేరేదాకా వేచి చూడటమూ జగన్ వ్యూహమే అనుకోవాలి.
ముఖ్యంగా ఇటీవల కాలంలో లోకేష్ పాదయాత్ర పదనిసలు సోషల్ మీడియాలో బాగా హై లైట్ అయ్యాయి. చాలా నెగటివ్ టాక్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆ యువగళం సొంత గొంతుతో మాటలు నేరుస్తూ పాదయాత్ర ఓ గాడిన పడిందనుకున్నతరుణంలో ఇది ఊహించని దెబ్బ.. యాత్ర మానుకుని లోకేష్ తండ్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేయాలనుకున్న టీడీపీ ఆలోచన కార్యరూపం దాల్చకుండా పోలీసులు గట్టిగా వ్యవహరించారు.
నో.. సానుభూతి (CBN)
మరోవైపు అసలు చంద్రబాబు ఊహించినంత సానుభూతి జనంలో కూడా లేదని అర్దమైపోయింది. పార్టీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు జనాన్ని మొబిలైజ్ చేయమని నేతలను వత్తిడి చేసిన వీడియో కాల్ వింటే ఆ పార్టీ దయనీయ పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. టీడీపీ బంద్ పిలుపు కూడ అంతంత మాత్రంగానే కనిపించింది. చాలా చోట్ల బస్సులు, ఆటోలు యధావిధిగా నడిచాయి.
వ్యూహం లేని సేనాని
ఇందులో అందరికన్నా ఎక్కువ అపహాస్యం పాలయ్యింది మాత్రం జనసేనానే..తనకున్న ఫ్యాన్స్ ని పెట్టుబడిగా పెట్టి రచ్చ రాజేద్దామనుకున్న ప్లాన్ ను పోలీసులు లౌక్యంగా నీరు గార్చారు.. రాష్ట్రంలో ఓ మాజీ సీఎం అరెస్టు నేపధ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సహకరించాల్సిందిపోయి అప్పుడే మంగళగిరి ప్రయాణం అంటూ కారులో బయల్దేరి భంగపడ్డారు పవన్. టీడీపీ శ్రేణుల హడావుడి పెద్దగా కనిపించకపోవడంతో తన సైన్యాన్ని పంపి అలజడి రేపాలని తలచారేమో. అందుకే పోలీసులు అడ్డుకుంటే రోడ్డుపైనే పడుకుని పక్కా సినిమా విన్యాసాలు చేశారు. పైగా చంద్రబాబుకు సానుభూతి తెలిపేందుకు తాను వెళుతున్నానని ఒకసారి, మంగళగిరిలో తన కార్యాలయానికి వెళుతున్నానని మరోసారి తనకు తోచిన కారణం చెప్పారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ అంటూ ఇష్టాను సారం రెచ్చిపోయి మాట్లాడే పవన్ ఇప్పుడు చంద్రబాబు అవినీతిపై ఏం కామెంట్ చేస్తారు?
టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చేందుకు ఆపసోపాలు పడుతున్న పవన్ కల్యాణ్ తాజా పరిణామాల నేపధ్యంలో టీడీపీతో కలసి అడుగేస్తారా? అందుకు బీజేపీ ఒప్పుకుంటుందా? వ్యూహమే లేని పవన్ కు ఈ పరిస్థితి పూర్తి అయోమయంగా ఉంది.
అసలు కథ ముందుంది… (CBN)
ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ఒక చిన్న శాంపిల్… ఇంకా ముందు ముందు చాలా స్కాములు బయటకొస్తాయి. అప్పటి మంత్రులంతా జైలుకే వెళతారు అంటోంది వైసీపీ. పైగా ఈ కేసులో చంద్రబాబుకు(CBN) పక్కాగా పదేళ్ల జైలు శిక్ష పడుతుందంటున్నారు న్యాయనిపుణులు..పోనీ అసలు శిక్ష పడకపోయినా.. ఈ కేసుల వ్యవహారం ఓ వైపు రాచపుండులా వేధిస్తుంటే ఎన్నికల బరిలోకి ఏ వ్యూహంతో ముందుకెళతారు? మొత్తం మీద వైసీపీ రచించిన వ్యూహానికి టీడీపీకి దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. ఈ యుద్ధం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.