స్నేహ బ్యారక్ సాక్షిగా కుదిరిన స్నేహ బంధం (PK-CBN)
(PK-CBN)
ఎట్టకేలకు బ్రహ్మాండం బద్దలైంది. కుండబద్దలు కొట్టారు. పావన గోదావరి తీరం సాక్షిగా, వందలాది మంది రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలు ఖైదీల సాక్షిగా ఓ పొత్తు పొడిచింది. కనిపించీ కనిపించకుండా, వినిపించీ వినిపించకుండా ఇన్నాళ్లూ సాగుతున్న టీడీపీ -జనసేన రహస్య వివాహ బంధాన్ని ఓపెన్ చేసేశారు పవన్.. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధిపతి అయిన నారా చంద్రబాబునాయుడు పరామర్శకు వెళ్లిన పవన్ కల్యాణ్ సెంట్రల్ జైలు వేదికగానే రాజకీయ వ్యూహం పన్నారు. 45 నిమిషాల ములాఖత్ లో చంద్రబాబుతో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు పట్ల దత్తపుత్రుడుగా భావించే పవన్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.ఆగ్రహంతో ఊగిపోయారు. ఇన్నాళ్లూ ఏదో అనుకున్నా.. ఇప్పుడు చెబుతున్నా..కాసుకోండి టీడీపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళతాయి. బీజేపి వస్తే మంచిది..రాకపోయినా ఫర్వాలేదు అనే తెగింపు మాటలు మాట్లాడారు.
చంద్రబాబు అనుభవశీలి, సమర్ధుడు.. అంటూ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం ఆయన చేతిలో పెడితే బాగుపడుతుందనే కారణంతోనే ఆయనకు మద్దతు పలికారట. హోదాకు బదులు ప్యాకేజీ తీసుకోవడం వల్లే విభేదించారట. అయినా అయిందేదో అయిపోయింది..ఇప్పుడవన్నీ తూచ్.. ఈ ఎన్నికలకు టీడీపీ అండతోనే జనసేన అడుగులేస్తుంది అని తేల్చి పారేశారు. కీలక దశలో జనసేన నాయకత్వ బాధ్యతల కాడి పడేశారు. మెడకు గుదిబండగా మారిన పార్టీని నిర్మించలేక, ముందుకు నడపలేక ఆపసోపాలు పడుతున్న పవన్ కల్యాణ్ టీడీపీ భుజాలపై సేద తీరుతున్నారు.
పార్టీ పెట్టి 14 ఏళ్లయినా గ్రామీణ స్థాయిలో పటిష్ట పరచకుండా కాలక్షేపం చేసి తీరా ఎన్నికలు వచ్చాక అభ్యర్ధులే కరువైన వేళ ఏం చేయాలో సతమతమవుతున్న పవన్ కు చంద్రబాబు అరెస్టు చాలా చాలా కలిసొచ్చిన విషయం. ఇన్నాళ్లూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను లాంటి నర్మగర్భపు మాటలు మాట్లాడుతూ పొత్తుపై డేరింగ్ గా ప్రకటన చేసేందుకు భయపడిన పవన్ కు బాబు అరెస్టు కలిసొచ్చిన అంశం.. పైకి జగన్ ను తిడుతున్నా.. పొత్తు లేనిదే తమ పార్టీ గట్టెక్కలేదన్నది పచ్చి నిజం.. ఈ నిజాన్ని బయట పెట్టలేక సతమతమవుతోంది జనసేన పార్టీ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో ఎవరి సంగతెలా ఉన్నా ముందు ఊపిరి పీల్చుకున్నది మాత్రం పవనే..
పొత్తు పొసుగుతుందా? సీట్ల సర్దుబాటు ఎలా? (PK-CBN)
వ్యూహరచన చేసే చంద్రబాబు జైల్లో ఉన్నారు.. జనసేన,టీడీపీ(PK-CBN) మధ్య సీట్ల పంచాయతీ తేలెదెలా? అనుభవం లేని లోకేష్ డీల్ చేయగలడా? అసలు తనపై తనకే అంచనా లేని జనసేనాని అసలు ఎన్ని సీట్లు అడుగుతారు? చంద్రబాబు అరెస్టు వల్ల సింపతీ ఫ్యాక్టర్ పార్టీకి ఉపయోగపడుతుందని పవన్ నమ్ముతుండొచ్చు. కానీ జనసైనికుల లెక్క వేరే.. తమ పవర్ స్టార్ ని ముఖ్యమంత్రిస్థానంలో కూర్చుంటే చూడాలన్నది వారి కల.. పవన్ కు ఉన్న ఇమేజ్, గ్లామర్ రీత్యా, సీట్లలో వాటా ఎక్కువే కావాలంటారు జనసైనికులు.. పైగా సీఎం పదవికి అభ్యర్ధి కావడంతో కూటమి గెలిస్తే తానే సీఎం అనే ప్రతిపాదన పవన్ చేస్తారా? మరి నారా వారసుడి పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఈవృద్ధాప్యంలో పడుతూ లేస్తూ చేస్తున్న రాజకీయం అంతా వారసుని నిలబెట్టుకోడానికే.. మంచికో, చెడుకో స్కిల్ స్కామ్ తెరపైకి వచ్చింది. తన అరెస్టుతో వచ్చే సానుభూతి పవనాలేవైనా ఉపయోగపడితే టీడీపీకి, లోకేష్ కి ఉపయోగపడాలన్నది చంద్రబాబు ఉద్దేశం. మరి వీరిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది? ఈ కూటమిలోకి మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటి? జనసేనాని మరోసారి తన సీఎం అభ్యర్ధిత్వాన్ని త్యాగం చేస్తారా? లేక పట్టుబట్టి సాధించుకుంటారా?
స్కామ్ లోతు తెలిసే ఈ నిర్ణయం?
ఏపీ స్కిల్ స్కామ్ పైకి కనిపించినంత ఆషామాషీ స్కాం కాదు.. దానిలోతు చాలా ఎక్కువ.. పైగా మరో ఏడు, ఎనిమిది కేసులు కూడా రేపు తెరపైకి రాబోతున్నాయి. దాంతో చంద్రబాబు పార్టీ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ఇప్పట్లో కష్టమే.. అందుకే టీడీపీ కూడా పవన్ మాస్ ఇమేజ్ ను ముందు పెట్టి కలసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తోందా? రాజమండ్రి ములాఖాత్ లో పవన్, బాబు, బాలయ్య, లోకేష్ మధ్య ఇదే తరహా చర్చ జరిగి ఈ స్కెచ్ తెరపైకి వచ్చి ఉండొచ్చు..
స్కాం పై పెదవి విప్పరెందుకు?
జగన్ ప్రభుత్వం అవినీతి పై బోడి గుండుకీ, మోకాలుకి ముడిపెడుతూ మాట్లాడే పవన్ ఏపీ స్కిల్ స్కామ్ పై పల్లెత్తు మాట అనలేదు.. కనీసం స్కాం జరగలేదు అంతా బూటకం అని కూడా అనలేదు. ఆ ఉదంతంపై తన అభిప్రాయం ఏంటో చెప్పలేదు. అక్కడ కూడా జగన్ ను తిట్టడం, ఆవేశంతో ఊగిపోవడం, నీతి వాక్యాలు వల్లించడంతోనే ముగించారు.
పవన్ నిర్ణయంపై అప్పుడే జనసేనలో అసంతృప్తి రాగం వినిపిస్తోంది. బేరం ఫిక్సయిపోయిందని ఇక జీవితంలో పవన్ సీఎం కాలేరంటూ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. జనసేనాని ఏకపక్ష నిర్ణయంపై బీజేపి ఏమంటుందో? ఈ పొత్తులో కమలం కూడా దూరితే ఏపీ రాజకీయం రంజుగా మారబోతుంది. జమిలి ఎన్నికలే వస్తే టీడీపీ పరిస్తితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లే.. అసలే నాయకత్వ లేమి. చెదిరి పోతున్న పార్టీ కేడర్ కి ధైర్యం చెప్పేదెవరు? అసలు ముందు అభ్యర్ధులు నిలబడతారా? దీనికి తోడు సందట్లో సడేమియా లా జనసేన తోడు.. సీట్ల సర్దుబాటు కిరికిరీలు, అసమ్మతి స్వరాల ఆగ్రహావేశాలు, రెబల్స్ బెడదను కంట్రోల్ చేసే దెవరు? టీడీపీకి అన్నీ సందేహాలే. పరిణామాలెలా ఉన్నా సింహం సింగిల్ అంటూ మీసం మెలేస్తోంది వైసీపీ. పవన్ ముమ్మాటికీ చంద్రబాబుదత్తపుత్రుడేనని, ప్యాకేజీ కుదిరాకే జైలులో పరామర్శ జరిగిందని విమర్శిస్తోంది వైసీపీ.