మొబైల్ ఫోన్లలో ఐ ఫోన్ లకున్న డిమాండే వేరు.. యాపిల్ ఐఫోన్ లంటే జనం ఓ రేంజ్ లో ఆసక్తి చూపుతారు.అందుకు ఇవాళ దేశంలోని రెండు స్టోర్ల ముందు కనపడిన సందడే రుజువు. నిన్ననే యాపిల్ ఫోన్ అమ్మకాలను ప్రకటించగా వేకువజామునుంచే వాటికోసం జనం యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. మనదేశంలో ఇప్పటి వరకూ రెండే రెండు యాపిల్ స్టోర్లు ఉన్నాయి. ఒకటి ఢిల్లీలోని సాకేత్ లో ఉండగా మరోటి ముంబైలోని బీకేసి దగ్గరున్న యాపిల్ స్టోర్.ఉదయం నాల్గింటినుంచే ప్రజలు బారులు తీరి నిలబడటం టెక్నాలజీ పట్ల మన వాళ్లకున్న క్రేజ్ తెలియచేస్తోంది. షాప్ ఓపెన్ చేయగానే మొదటి ఫోన్ మొదటి పీస్ తీసుకున్న కస్టమర్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఉదయం నాల్గు గంటలకే క్యూలో నిలబడి ఐ ఫోన్ కొన్నానని, ఆ ఫస్ట్ ఫోన్ తీసుకోవడంలో ఉన్న థ్రిల్లే వేరని, అది తనకు జీవితాంతం రికార్డుగా మిగిలిపోతుందని ఆ కస్టమర్ అన్నాడు. సాధారణంగానే యాపిల్ ఫోన్లకు డిమాండ్ ఉండగా ఇప్పుడు ఐఫోన్ 15 సీరీస్ మార్కెట్ లోకి తీసుకు రావడంతో టెక్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవ్.
ఐఫోన్ 15 లో కెమెరా ఫీచర్స్ అదుర్స్…
యాపిల్ కంపెనీ సాధారణంగా ఐఫోన్ కెమెరాను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. తాజాగా 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ను 48 మెగాపిక్సెల్స్ కి అప్ గ్రేడ్ చేయడం జరిగింది. వీటి ద్వారా 3X నుంచి 6X వరకు జూమ్ చేసి ఫోటోలు తీయొచ్చు. యాపిల్ కంపెనీ తన లేటెస్ట్ ఐఫోన్లలో ఆల్ట్రావైడ్ బ్యాండ్ సెమీకండక్టర్ ను పొందుపరిచింది. దీని ద్వారా ఫోన్ లొకేషన్ ను చాలా కచ్చితంగా తెలుసుకోవచ్చు. అంటే ఒక వేళ ఫోన్ ఎక్కడైనా పోయినా ఫైండ్ మై యాప్ ద్వారా చాలా సులువుగా దానిని ట్రాక్ చేయవచ్చు. ఇది వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక యాపిల్ ఈ సరికొత్త ఐఫోన్లు అన్నింటిలోనూ యూఎస్బీ-సీ వైర్డ్ ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ ని అందుబాటులోకి తీసుకోవచ్చింది. అలాగే చాలా వేగంగా డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
అనేక కొత్త ఫీచర్లతో యాపిల్ సీరీస్
యాపిల్ ఐ ఫోన్లలో కొత్త బటన్ల వల్ల మనం అనేక పనులు ఒకేసారి చేయొచ్చు. యాపిల్ వాచ్ అల్ట్రాలో ఇలాంటి యాక్షన్ బటన్‌ను చూడొచ్చు. ఉదాహరణకు ఆ బటన్‌తో మనం స్టాప్‌వాచ్, వర్కౌట్, బ్యాక్‌ట్రాక్ తదితర ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు వాటితోనూ ఫోన్ టర్నాఫ్ చేయొచ్చు. ఈ కొత్త ఫోన్లో లైవ్ బటన్ లేకుండా సెన్సార్లాగా ఉంటుందనే వివరాలు బయటికొచ్చాయి. ఐఫోన్ 14 సిరీస్ మొదటి రోజుతో పోలిస్తే యాపిల్ తాజా ఐఫోన్ 15 సిరీస్ 100 శాతం వృద్ది నమోదు చేసినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత్ లో తయారైన ఈ మోడళ్లకు అధిక డిమాండ్ లభిస్తోందని ఐ ఫోన్ కంపెనీ అంటోంది. ఇందులో కొత్త లైవ్ బటన్లు రానున్నాయి. అలాగే ఈనెల 12న అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ ను, యాపిల్ వాచ్ సీరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను యాపిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఐఫోన్ 15 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
యాపిల్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఐఫోన్ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనే నాలుగు సరికొత్త ఫోన్లను తీసుకువచ్చింది. ఐఫోన్ 15మోడల్ అనేవి బేస్ మోడల్స్ కాగా.. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మాదిరిగా అల్యూమినియం సైడ్స్, గ్లాస్ బ్యాక్ ఉంటాయి. కానీ ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లాంటి హై-ఎండ్ ఫోన్లను మాత్రం సరికొత్త డిజైన్‌తో, సూపర్ ఫీచర్లతో తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా వీటిని స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం లాంటి లోహాలతో రూపొందించారు.
యాపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ సైజ్ 6.1 నుంచి 6.7 అంగుళాలుగా ఉంటుంది. అలాగే వీటి స్క్రీన్ బోర్డర్స్ 1/3వ వంతు సన్నగా ఉంటాయి. యాపిల్ ఇప్పుడు లో-ఇంజిక్షన్ ప్రెజర్ ఓవర్ మౌల్డింగ్ లిపో అనే పద్ధతి ఉపయోగించి తమ ప్రొడక్టులను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లలో A 17చిప్ ను ఇన్ స్టాల్ చేశారు. దీని వల్ల ఈ హైఎండ్ ఫోన్ల ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది. కానీ ఐఫోన్ 15 ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లలో మాత్రం ఇంకా పాత A16 చిప్ ను మాత్రమే వినియోగిస్తున్నారు.