కెనడా(canada) మద్దతు నిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటు వాదం అక్కడి భారతీయుల ప్రాణాలకు ముప్పు తెచ్చేదిలా ఉంది. కెనడాలో మైనారిటీలు గా బతుకున్న హిందువుల ప్రాణాలు, ఆస్తులకు ఇప్పుడు భద్రత కరువవుతోంది. ఖలిస్తానీ అనుకూలురు బాహాటంగా హిందువులను బెదిరించడం, దాడులు చేయడం, రెచ్చగొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అక్కడున్న హిందూ ఆలయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న వియన్నా కన్వెన్షన్ కు వ్యతిరేకమని మన ప్రభుత్వాధికారులు అంటున్నారు.
మానవ హక్కుల అమలు విషయంలో ఇక్కడ రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. పంజాబ్ లో ఉన్న డ్రగ్ ట్రాఫికింగ్, బెదిరింపులు, హింస, తదితర సంఘటనలపై కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటు వాదులు వేగంగా స్పందిస్తున్నారని, ఇక్కడ ఏం జరిగినా అక్కడ ప్రతిస్పందన ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ అంశంపై అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నాయి.
పంజాబ్ లో విధ్వంసాలకు అక్కడనుంచే ప్లాన్
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు బెదిరింపులకు, హింసాత్మక కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడం లాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం తెలియ చేస్తోంది. కెనడా(canada) నుంచి ప్రాయోజిత హింసాత్మక కార్యకలాపాలే పంజాబ్ ను రావణ కాష్టంలా మండిస్తున్నాయని మన ఇంటెలిజెన్స్ నివేదికల్లో కూడా తేలింది. గత కొన్నేళ్లుగా పంజాబ్ లో పట్టుబడిన గ్యాంగ్ స్టర్లు, నేరగాళ్లను పరిశీలిస్తే వారికి కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటు వాదులతో లింకులున్నట్లు అనేక సందర్భాల్లో రుజువైంది.
కెనడాలోకూడా ఖలిస్థానీ వేర్పాటువాదులు డ్రగ్స్ బిజినెస్ లో ఉన్నారు. కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్లు పాకిస్థాన్ ద్వారా డ్రోన్లతో డ్రగ్స్ ను, నగదును తీసుకొచ్చి పంజాబ్ సరిహద్దుల్లో వదులుతున్నారు. ఇందులో కొంత సొమ్ము కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులకు అందుతోంది. రాను రాను ఈ డ్రగ్స్ విక్రయాల వ్యవహారం ముదిరి కెనడానుంచే నేరుగా ఇక్కడ విద్రోహ చర్యలకు పాల్పడే స్టేజికి ఖలిస్తానీ వేర్పాటు వాదులు వచ్చేశారు.
పంజాబ్ లో నమోదైన ఉగ్రవాద కేసుల్లో సగానికి పైగా కెనడానుంచి ఆపరేట్ చేసే ఖలిస్థానీ వేర్పాటు వాదుల ప్రమేయం ఉన్న కేసులే. కెనడాలో కూడా మెజారిటీ ఖలిస్తానీ వాదులంతా డ్రగ్స్ బిజినెస్ లో ఉన్నారు. అక్కడ డ్రగ్స్ స్మగ్లర్లకు చెందిన గ్రూపుల మధ్య గొడవలున్నాయి. హత్యలు, ప్రతిహత్యలు అక్కడ కామన్. ఇప్పుడు అదే వాతావరణం పంజాబ్ లోనూ తయారవుతోంది.
ఉద్దేశపూర్వకంగా తాత్సారం (canada)
కెనడాలోని సర్రేలో రిపుదమన్ సింగ్ మాలిక్ అనే భారత అనుకూల సిక్కు ను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను కూడా ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. అయితే ఈ హత్యలకు కారకులను వెతికిపట్టుకునే అంశంపై కెనడా కావాలనే తాత్సారం చేస్తోంది. ఈ కుట్రకు కారకులను పట్టుకోవడంపై కెనడా(canada) ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది.
పంజాబ్ లో 2016 తర్వాత హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు దారుణంగా హత్యకు గురి కావడం వెనక ఉగ్రవాది నిజ్జర్, ఆతని అనుయాయుల హస్తం ఉందని తేలింది. అయినా కెనెడా దర్యాప్తు సంస్థలు నిజ్జర్ వ్యవహారంపై ఎన్నడూ దర్యాప్తుకు పూనుకోలేదు. ఇప్పటికీ కెనడాలో వారిని రాజకీయ కార్యకర్తలుగా చూస్తున్నారు తప్ప ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అన్న కోణంలో చూడటం లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో గత 50 ఏళ్లుగా కెనడా గడ్డపై ఉంటూ ఈ ఖలిస్థానీ వేర్పాటువాదులు యధేచ్ఛగా భారత్ పై విషం కక్కుతున్నారు.1985లో కనిష్క బాంబింగ్ ఘటనే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ.