Sridevi
పూల రెక్కలు..కొన్ని తేనెచుక్కలు రంగరిస్తివో.. ఇలా బొమ్మ చేస్తివో అంటూ శ్రీదేవి అందంపై గోవిందా, గోవిందా సినిమాలో నాగార్జున పాడతాడు.. నిజమే శ్రీదేవి అలాంటి దేవకన్యే.. అంత అమాయకమైన బ్యూటీయే.. పెద్ద పెద్ద కళ్లు, చక్కని చిరునవ్వు, మెరిసే బుగ్గలు.. ముద్దుగా ఉండే బొమ్మ శ్రీదేవి. అలాంటి శ్రీదేవికి సంబంధించిన కొన్ని గాసిప్స్ కి ఇన్నాళ్లకి తెరపడింది. అందాల సుందరి చనిపోయి అయిదేళ్లవుతున్నా.. తన దేవ కన్య రూపం పైనా, అమ్మతనంపైనా, అర్ధాంతర మరణం పైనా పుట్టిన పుకార్లన్నింటికీ తెర పడింది ఇన్నేళ్లకి.. ఆ రూమర్లకు తెర దించింది ఎవరో కాదు. ఆమె భర్త బోనీ కపూర్.
కానీ ఈరోజుకీ శ్రీదేవి గురించి ఏ చిన్న వార్తయినా, అది ఒకసారి వినేసిన వార్తే అయినా మళ్లీ మళ్లీ చదువుతాం.. గాసిప్ అయినా సరే.. శ్రీదేవి అంటే అనుకోకుండానే మన కళ్లు అక్షరాల వెంట పరుగులు తీస్తాయ్.. దటీజ్ శ్రీదేవి.
తాజాగా శ్రీదేవి పెళ్లి, ఆమె మరణంపై గతంలో ప్రచారంలోకి వచ్చిన వార్తలే మరోసారి వైరల్ అయ్యాయి. అయితే ఈసారి ఆ గాసిప్స్ పై క్లియర్ కట్ క్లారిటీ అదీ ఆమె భర్తే ఇవ్వడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోని కపూర్ మాట్లాడుతూ శ్రీదేవి గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను బయట పెట్టాడు.కొన్ని సందేహాలకు జవాబులిచ్చాడు. మరికొన్ని పుకార్లపై వివరణ ఇచ్చాడు.
పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతా? Sridevi
బాలీవుడ్ లో హాట్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది.. పెళ్లి..అది హీరోయిన్ల పెళ్లిళ్లయితే ఇక అంతకన్నా పెద్దవార్త ఉండదు.. అలాంటిది పెళ్లికి ముందే గర్భం దాల్చడం అంటే అది మరీ సెన్సేషనల్ న్యూస్.. ఇప్పుడంటే నీనాగుప్తా , ఆలియాభట్, ఇలియానా,స్వర భాస్కర్, ఇంకా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయ్ కానీ.. ఈట్రెండ్ కొత్తగా వచ్చిందేమీ కాదు. 1990లనుంచే ఉంది.. బహుశా అంతకుముందు నుంచీ ఉందేమో తెలీదు.కానీ శ్రీదేవితో ఈ ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. శ్రీదేవి పెళ్లికి ముందే తల్లి అయిందంటూ షాకింగ్ న్యూస్ అప్పట్లో బాగా వినిపించింది.. ఆ వార్త అప్పట్లోనే పెను దుమారాన్ని రేపింది. అప్పటినుంచి అందరూ అదే నమ్మారు. కానీ అది నిజం కాదంటూ బోనీకపూర్ కుండ బద్దలు కొట్టారు.
శ్రీదేవి, బోనీ కపూర్ ల పెళ్లి 1996 మే 2వ తేదిన షిరిడీలో రహస్యంగా జరిగింది. మే లో వివాహం చేసుకున్నాక జనవరిలో ఆమె గర్భం దాల్చింది. శ్రీదేవి గర్భవతి అవ్వటంతో వేరే మార్గం లేక గతంలోనే పెళ్లయ్యిందని చెప్పలేక జూన్2న వివాహం చేసుకున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు ఈ జంట. పెళ్లికి ముందే జాన్వీ పుట్టిందంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని బోనీ కపూర్ తెలిపారు.తమ పెళ్లి జరిగిన విషయాన్ని దాచడం వల్లనే ఇలాంటి పుకార్లు వచ్చాయన్నారాయన. ఏదేమైనా శ్రీదేవి పెళ్లి అయ్యాకే బిడ్డని కన్నదన్న నిజం ఇన్నాళ్లకు బయటపడింది. ఇప్పుడైతే పిల్లల్ని కనేందుకు పెళ్లి అవసరమేలేదంటున్నారు నేటి తరం వాళ్లు.. ఆలియా భట్, ఇలియానా, స్వర భాస్కర్ పెళ్లి, గిళ్లీ లేకుండానే పిల్లల్ని కన్నారు.
గ్లామర్ కోసం జీవితాన్ని త్యాగం చేసిందా?
శ్రీదేవిది సహజ మరణం కాదన్నది అందరికీ కలిగే సందేహమే.. నిక్షేపంలా ఉన్న ఆమె బాత్ టబ్ లో చనిపోవడమేంటంటూ అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆస్తుల పంపకాల్లో గొడవలతో బోనీ కపూరే ఆమెను హత్య చేశాడనే విమర్శలూ రేగాయి. ఆ వార్తలపైనా బోనీ కపూర్ తన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. శ్రీదేవి పైకి అందంగా కనిపించే దేవకన్య..కానీ ఆమె అంతకన్నా సున్నితమైన గాజు బొమ్మ. తన గ్లామర్ కాపాడుకోటం కోసం ఆమె చేసినంత రిస్క్ ఎవరూ చేసి ఉండరు. సన్నగా, నాజూగ్గా కనిపించడానికి ఆమె తిండిని త్యాగం చేసింది. కఠినమైన ఆహార నియమాలు పాటించింది. అందంకోసం డైట్ లో ఉండేది.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకోవడం, ఉప్పు,కారం లేని చప్పిడి తిండి తినడంతో ఆమెకు ఇతర సమస్యలు మొదలయ్యాయి. ఉప్పు లేక లో బీపీకి గురై అనేక సార్లు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. పెళ్లికి ముందే శ్రీదేవి చాలా కఠినమైన ఆహార నియమాలు పాటించేది.. ఎంతలా అంటే ఒక్కోసారి సెట్ లోనూ అస్వస్థతకు గురైన సన్నివేశాలున్నాయి అన్నాడు బోనీ . ఓ షూటింగ్ స్పాట్ లో పెళ్లికి ముందు శ్రీదేవిని కలసినప్పుడు పక్కనే ఉన్న నాగార్జున కూడా ఇదే విషయం ప్రస్తావించాడట. షూట్ టైమ్ లో ఆమె అస్సలు ఏమీ తినరు.. తరచుగా నీరసపడుతున్నారని అన్నాడని బోనీ కపూర్ తెలిపాడు.
బోనీని నిర్బంధించిన దుబాయ్ పోలీసులు
శ్రీదేవి మరణం అప్పట్లో బోనీకపూర్ మెడకు చుట్టుకుంది. రకరకాల పుకార్ల నేపధ్యంల తనను 24 గంటలు దుబాయ్ పోలీసులు నిర్బంధించి ఇంటరాగేట్ చేశారని, లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని బోనీ తెలిపాడు. శ్రీదేవి మరణం వెనుక తన కుట్రలు,కుతంత్రలు లేవని గ్రహించిన పోలీసులు ఎట్టకేలకు వదిలేశారని అన్నాడు. Sridevi