క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ (WC) ప్రారంభానికి అంతా రెడీ అయింది. తొలి మ్యాచ్‌కు టాస్ పడటమే ఆలస్యం. అయితే ఈ మెగా టోర్నీలో ఏ టీమ్ వరల్డ్ కప్ గెలుస్తుంది..? ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? హాట్ ఫేవరేట్‌గా ఉన్న టీమిండియాకు ప్రధాన పోటీ ఏ టీమ్ నుంచి ఉంది? ఇలాంటి ప్రశ్నలు క్రికెట్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఈ మెగా టోర్నీలో రోహిత్ సేనా ఎలా రాణించబోతున్నారన్న దానిపైనే టీమ్ భవిష్యత్తు ఉంది.
బస్తీ మే సవాల్ అంటున్న టీమిండియా (WC)
ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం వన్డే వరల్డ్ కప్‌పైనే ఉంది. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇప్పటికే వరల్డ్ కప్ ఫీవర్ ఎక్కేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాపైనే ఫోకస్ పెట్టారు. పైగా ఆసియా కప్ 2023, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ విజయాలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. జట్టులోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో.. ఈ సారి కప్పు కొట్టకుండా టీమిండియా ఆపేది ఎవడ్రా అంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే టీమిండియా అంత స్ట్రాంగ్‌గా ఉందా.? అసలు బలం, బలహీనతలు ఎలా ఉన్నాయి.?
సూపర్ ఫామ్ లో చెలరేగుతున్న జట్టు (WC)
టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న మాట వాస్తవం.. అందరూ ఒప్పుకోవాల్సిందే. జట్టులోని ప్రతి ఆటగాడు మంచి టచ్‌లో ఉండటం భారత జట్టు ప్రధాన బలంగా చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్.. టీమ్‌కు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. ఇక వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ ఉండటం టీమిండియా కొండంత అండ. కోహ్లీ స్టామినా, క్యాలిబర్పై ఎవరికి ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్డిక్ పాండ్యాతో మిడిల్డార్ సైతం చాలా పటిష్టంగా ఉంది. వారిలో ఎవరికి రెస్ట్ ఇచ్చినా.. ఇషాన్ కిషన్ సైతం ఫామ్‌లో ఉన్నాడు. ఇక రవీంద్ర జడేజా సైతం బాల్‌తో అదరగొడుతున్నాడు. కుల్దీప్ యాదవ్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్ ఉన్నాడు. పైగా కుల్దీప్ కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు.
పేసర్లు చీల్చి చెండాడుతారు
ఇక పేస్ ఎటాక్ అయితే.. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా ఉంది. బుమ్రా, సిరాజ్, షమీ.. పిచ్ నుంచి హెల్ప్ లేకపోయినా.. మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక పిచ్ నుంచి స్వింగ్ లభిస్తే.. వీళ్లను ఎదుర్కొవడం ప్రపంచంలో ఏ టీమ్ వల్ల కాదు. పైగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు మన దేశంలోనే జరుగుతుండటం టీమిండియా కలిసొచ్చే అంశం. మన పిచ్‌లపై, వేల మంది అభిమానల మధ్య రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా బెబ్బులిలా చెలరేగే అవకాశం ఉంది. 2011లో టీమిండియా గెలిచిన వరల్డ్ కప్ సైతం.. మన దేశంలోనే జరగింది.ఇప్పుడు అదే మ్యాజిక్‌ను టీమిండియా రిపీట్ చేస్తుందని, చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఫీల్డింగ్ దెబ్బేస్తుందా?
ఓవరాల్‌గా టీమ్.. బ్యాటింగ్ బౌలింగ్‌లో అద్భుతంగా కనిపిస్తోంది. కానీ, ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది. ఇదొక్కటే ప్రస్తుతం టీమిండియాలో కనిపిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఆసియా కప్ 2023, ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఫీల్డింగ్‌లో చాలా పొరపాట్లు చేసింది. ముఖ్యంగా చాలా సులువైన క్యాచ్‌లను సైతం టీమిండియా ఆటగాళ్లు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ ఫీల్డర్ నుంచి కూడా క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయి. మరి వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ నెగ్గాలంటే.. అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉండాలి. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఫీల్డింగ్‌లోనూ మెరుగైతేనే.. విజయావకాశాలు మరింత బలపడతాయని చెప్పవచ్చు. (WC)