కృష్ణా జిల్లాలో వారాహి యాత్రలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ (PK) కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏ కూటమినుంచి తమ పార్టీ బయటకు వచ్చేసిందని ఏకపక్ష ప్రకటన చేసి ఏపీ పాలిటిక్స్ లో మరింత హీట్ పుట్టించారు. టీడీపీ చాలా బలహీన పరిస్థితులలో ఉందని, కాబట్టి దానికి తన మద్దతు అవసరమని అలా చేశారట. బీజేపీకి ఇష్టముంటే తమతో పొత్తులో ఉండొచ్చంటూ పెద్ద మనసు కూడా ప్రదర్శించారు.
పొత్తు ధర్మం పాటించని పవర్ స్టార్ (PK)
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రారు అన్నది చాలా మంది విశ్లేషకులు చేసే కామెంట్. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన సీఎం అయితే చూడాలని చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజకీయమంటే తెలియని పవన్ ఆదినుంచి ఇప్పటి వరకూ తప్పటడుగులే వేస్తూ వచ్చారు. తాజా పరిణామాలు ఆయన నిలకడలేని మనస్తత్వాన్ని బయట పెడుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన నుంచి చచ్చీ చెడీ ఓ ఎమ్మెల్యే గెలిచాడు. అతను కూడా ఆ పార్టీలో ఉండి ఉపయోగం లేదని జనసేనకు దూరంగానే ఉన్నాడు. రెండుచోట్ల పోటీ చేసినా ఓడిపోయిన పవన్ ఇక గతి లేని పరిస్థితుల్లో బీజేపీ తో పొత్తు కోసం వెంపర్లాడారు.
ఢిల్లీ వెళ్లి మరీ అనేక సార్లు అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు, ప్రధాని మోడీలను కలిశారు.. అప్పట్లో బీజేపి జాతీయ పార్టీ. హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీ.. ఈ దేశానికి మోడీ నాయకత్వం చాలా అవసరం అంటూ ప్రకటనలు గుప్పించారు పవన్. . ఏపీలో బీజేపికి సీన్ సున్నా.. కాబట్టి వారు కూడా పవన్ చరిష్మా అంతో ఇంతో ఉపయోగపడుతుందనే భావనతో ఆయనతో పొత్తుకు ఓకే చేశారు ఒకే ఒక్క సీటుతో ఫ్లాప్ షో ప్రదర్శించిన పార్టీని మిత్రపక్షంగా స్వీకరించడమే గొప్ప.. అయితే తాము కూడా అలాగే ఉన్నాం కదా అని బీజేపి పవన్ కు పెద్ద పీట వేసింది. ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనకు ప్రయారిటీ ఇచ్చి మాట్లాడుతూ వచ్చింది. బీజేపి లాంటి కేంద్ర పార్టీ మద్దతు ఉన్నప్పుడు జనసేన ఎంత బలంగా ఎదగొచ్చు? క్లీన్ పాలిటిక్స్ చేస్తాను, రాజకీయాలను మార్చేస్తానంటూ అట్టహాసపు ప్రకటనలిచ్చి ఆర్నెల్లు కూడా అవలేదు..పవన్ మళ్లీ ప్లేటు తిప్పేశారు.
టీడీపీపై వల్ల మాలిన ప్రేమ
పవన్ కల్యాణ్ కు టీడీపీపై వల్లమాలిన ప్రేమ. అది కాలానికి, సమయానికి అతీతమైనది. ఆయన మనసులో ఆ పార్టీ పట్ల చాలా చాలా ప్రేమ ఉంది. ఇది ఈ మధ్య రాజకీయ పరిణామాలతో తేటతెల్లం అయింది.అసలు తనకున్న స్టార్ ఇమేజ్ తో సీఎం అవ్వాలన్న కోరిక పుట్టి పార్టీ పెట్టారు కానీ, లేకపోతే టీడీపీలోనే చేరేవారేమో. చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళితే దిక్కూ మొక్కు లేకుండా అయిపోతున్న పార్టీని కాపాడటానికి పవన్ రంగ ప్రవేశం చేశారు. సింగిల్ గా పోటీ చేయడానికి భయపడే పవన్, టీడీపీ చేయి పట్టుకుని ఎలాగోలా గట్టెక్కి అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అనుకుంటున్నారు. అందు కే టీడీపీ సింపతీ వేవ్ ఉపయోగపడుతుందనే ఓ ఐడియాకి వచ్చారు.
అటూ లీడర్ లేక అయోమయంలో ఉన్న టీడీపీ కూడా గతిలేని పరిస్థితుల్లోనే ఒప్పుకుంది. ఇంకేముంది బీజేపిని ఎడం కాలితో తన్నేశారు పవన్. కావాలంటే బీజేపి కూడా తమతో కలవొచ్చునంటూ విశాల హృదయంతో ప్రకటన చేశారు. పవన్ ఏక పక్షంగా తెగతెంపులు చేసేసుకోవడంతో బీజేపి అయోమయంలో పడింది. అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టి విషయం బీజేపి అధిష్టానానికి చెబుతానని వారే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని ప్రకటించారు. ఇప్పటికీ తాము పవన్ తో పొత్తులోనే ఉన్నామని కూడా ప్రకటన చేశారు.
వదుల్చుకుందామని పవన్ ప్రయత్నిస్తుంటే.. ఇంకా పట్టుకు వెళ్లాడుతోంది బీజేపి. ఎన్డీఏ లో ఉన్నానంటూ ఇన్నాళ్లూ డాంబికం ప్రదర్శించిన పవన్.. ఆ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ఇది కూడా వ్యూహాత్మక తప్పిదమే.. కేంద్రంలో ఈసారి కూడా మోడీయే అధికారంలోకి వస్తారన్నది ఖాయంగా కనిపిస్తోంది.. టీడీపీ కోసం పవన్ జాతీయ పార్టీ అండని దూరం చేసుకున్నారు. అసలు టీడీపీ భవిష్యత్తు ఏంటో తెలియని టైమ్ లో పరుగు పరుగున వెళ్లి పొత్తు ప్రకటించేసి మరో తప్పిదం చేశారన్నది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన.
బాబు అవినీతిపై నోరు విప్పరెందుకు?
మాటకు ముందు జగన్ అవినీతిపరుడంటూ, నోరు నొప్పెట్టేలా తిట్టే పవన్ చంద్రబాబు అవినీతిపై ఒక్క మాట కూడా మాట్లాడరు..కానీ ఇప్పుడు ఎన్నికల టైమ్ కాబట్టి ప్రచార సభల్లోనైనా టీడీపీ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏదో ఒక స్పందన చెప్పక తప్పదు.. అవినీతి రహిత పాలన అజెండా అనే పవన్ మరి అవినీతి మరక పడిన పార్టీతో అంటకాగడం ఎందుకో ?
మోడీతో పెట్టుకున్న పవన్ (PK)
ఈ విషయం అలా ఉంచితే అసలే మోడీతో పెట్టుకున్నారు పవన్ కల్యాణ్.. మోడీ లాంటి పెద్ద మనిషితో జరిగినంత కాలం స్నేహం బానే ఉంటుంది. పొరపాటున అటు.. ఇటు.. అయితే మాత్రం సింహం నోట్లో తల దూర్చడం లాంటిదే.. ఈ తత్వం ఇప్పుడిప్పుడే కేసీఆర్ కు బోధపడుతోంది. ప్రైవేటు సంభాషణలని ఓపెన్ గా చెప్పేసిన మోడీ రేపు పవన్ తో జరిగిన ప్రైవేటు సంభాషణల్ని కూడా బయటపెడితే జనసేనాని ఏం చేస్తారు? రాజకీయం, సినిమాలు ఒకటి కాదని పవన్ ఎప్పుడు తెలుసుకుంటారో?