ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జగన్ అనంతరం వైఎస్సార్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లాకు బయలుదేరి వెళతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్డం చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని జగన్ రైతులకు అందచేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇడుపులపాయకు వెళ్లి…
అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు బయలు దేరి కడపజిల్లకు చేరుకుంటారు. మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపాయలకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. ఇడుపులపాయలో రాత్రికి బస చేయనున్న జగన్ 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట కు చేరుకుని ఒబరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి వ్యూ పాయింట్ ను కూడా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుని కొత్తగా నిర్మించిన మున్సిపల్ భవనానికి జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అక్కడినుంచి పులివెందులలోనే ఏర్పాటు చేసిన నగరవనాన్ని కూడా ప్రారంభిస్తారు.
అభివృద్ధి పనులకు…
ఆ తర్వాత గరండాల రివర్ ఫ్రంట్ వద్ద డెవలెప్ మెంట్ ఫేజ్ 1 పనులను జగన్ ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ స్కిల్ డెవెలెప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తారు. అక్కడినుంచి ఏపీ కార్ల్ లో ఏర్పాటు చేసిన న్యూ టెక్ బయోసైన్సెస్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుని రాత్రి బస అక్కడే చేస్తారు. పదో తేది ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడపకు చేరుకోనున్న జగన్ కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్క్ తో పాటు పలు అభివృద్ధి పనులను జగన్ ప్రారంభిస్తారు. కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లి అక్కడి పారిశ్రామిక వాడబలో అల్ డిక్సన్ యూనిట్ కు రిబ్బన్ కట్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు.
Follow Us On : YouTube , Google News