(Asia Cup)
నేటి నుంచి మరో మినీ సమరం ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రియులకు వచ్చే నెల 17వ తేదీ వరకూ పండగే పండగ. ఆసియా కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 2వ తేదీ దాయాదుల సమరంతో ఆసియా కప్ ఫీస్ట్ మరింత రుచికరంగా మారనుంది. ఒళ్లు జలదరించే షాట్లు.. రోమాలు నిక్కబొడుచుకునేలా క్యాచ్ లు.. రన్ అవుట్… చూసే వారికి చూసినంత. కావాల్సినంత వినోదం. వినోదంతో పాటు ఉత్కంఠ. బాల్ బాల్ కు టెన్షన్. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్ లో ఏ జట్టు బలమైనది? ఏ జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకుంటాయి? ఫైనల్ కు చేరుకునే టీంలు ఏవి? ఇలాంటి ప్రశ్నలను ప్రతి క్రికెట్ ఫ్యాన్ ను వేధిస్తూనే ఉంటాయి. వారి కోసమే ఈ స్టోరీ.
అత్యధిక సార్లు…
ఇప్పటి వరకు పదమూడు సార్లు వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరిగింది. మరో రెండుసార్లు టీ20 ఫార్మాట్ లో జరిగింది. టీం ఇండియా అత్యధిక సార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ కు ముందు తమ జట్టు కూర్పును సరిచూసుకోవడానికి, బలాబలాలను అంచనా వేసుకోవడానికి, ఎంతో విలువైన ప్రాక్టీస్ ను పొందడానికి ఆసియా కప్ ఓ చక్కని అవకాశమనే చెప్పాలి.
అశ్విన్ ఏమన్నారంటే…
ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ జట్లే ఫేవరేట్స్ అని.. కాకపోతే పాకిస్తాన్ జట్టుతో మరింత ప్రమాదకరమని టీం ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీ ఫేవరేట్ గా టీమ్ ఇండియాతో పాటు పాకిస్తాన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అన్నారు. పాక్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా మారింది. పీఎస్ ఎల్ తో పాటు బీబీఎల్ లతో పాకిస్తాన్ ఆటగాళ్లు మరింత రాటు దేలారు. (Asia Cup)
ఎవరు ఫేవరెట్ ?
ఆసియా కప్ 2023 పరీక్షగా నిలవబోతుందని పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ తెలిపారు. ఐర్లాండ్ పర్యటనలో రీఎంట్రీ ఇచ్చిన జస్ ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ కు కూడా ఈ టోర్నీ పరీక్షగా నిలవనుందని తెలిపారు. ఆసియాకప్ లో ఎవరు ఫేవరేట్ అని చెప్పడం కష్టమని, తమదైన రోజున ప్రతి జట్టు చెలరేగుతుందన్నాడు. ఆసియాకప్ 2023 టోర్నీకి సంబంధించిన సాన్సర్ ఈ వెంట్ లో వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తొలిసారి నేపాల్…
దాయాదుల పోరులో ఎవరు అత్యత్తమంగా రాణిస్తారో.. వారిదే విజయమని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక కూడా పటిష్టంగానే ఉంది. అలాగే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లను సులువుగా తీసిపారేయలేమని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ లో ఫేవరేట్ ఎవరని చెప్పడం కష్టంగానే ఉంది అని తెలిపాడు. బుమ్రా అందుబాటులోకి రావడం టీమ్ ఇండియాకు అదనపు బలం అని అన్నాడు. అలాగే నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియా కప్ ఆడనుంది. దీంతో ఈ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు.
హోరాహోరీ….
అయితే మిగిలిన ఐదు జట్లకు టైటిల్ పోరులో హోరా హోరీ తలపడే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ ను భారత్ లేదా పాకిస్తాన్ గెలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. సొంతగడ్డపై జరుగుతుండటంతో శ్రీలంక అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. అయితే బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లను టాప్3 టీమ్స్ లైట్ తీసుకుంటే బొక్కబోర్లా పడటం ఖాయమన్నది గత మ్యాచ్ లు ఇప్పటికే చెప్పాయి. అందుకే ఆచితూచి మైదానంలో ఆడితేనే కప్ ను కొట్టే ఛాన్స్ ఉంది. (Asia Cup)