చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో 100 పతకాలపైగా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ క్రీడల్లో భారత ప్లేయర్లు ఇప్పటికే 21గోల్డ్, 32సిల్వర్, 33 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 90 పతకాలతో నాలుగో స్థానంలో నిలబడింది భారత్.ఈనెల 8 వరకు జరిగే ఆసియా క్రీడల్లో మన ప్లేయర్లు మరిన్ని మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆసియా క్రీడల్లో భారత్ ఇన్ని మెడల్స్ గెలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరిసారిగా భారత్ 2018 ఆసియా క్రీడల్లో 70 మెడల్స్ గెలుచుకుంది. అప్పటి మెడల్స్ లో 16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్ ఉన్నాయి. Asia Games
వందకు చేరువలో మనోళ్లు
చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఆర్చరీ విభాగంలో భారత ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పురుషుల ఫైనల్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు తలపడనున్నారు. మరోవైపు ఆర్చరీ విభాగంలో 3 వ్యక్తిగత పతకాలతోపాటు మొత్తం 9 పతకాల కోసం భారత క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఆర్చరీ విభాగంలో పురుషుల ఫైనల్స్ లో ఇద్దరు భారతీయులు తలపడనున్నారు. దీంతో వారిద్దరిలో ఎవరు గెలిచినా భారత్‌కు స్వర్ణం దక్కనుంది. ఇక ఓడినవారు సిల్వర్ మెడల్ అందుకోనున్నారు. ఇప్పటికే మహిళల విభాగంలో తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం ఫైనల్‌కు చేరుకుంది. మరో పతకం కూడా భారత్ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కలుపుకుంటే భారత్ సునాయాసంగా వంద పతకాలు సాధించేయగలదు. ఒకవేళ ఒకటి, రెండు తగ్గినా, ఇంకా రెజ్లింగ్, ఛెస్ కాంపిటీషన్ ఉన్నాయికాబట్టి అందులోకూడా ఏదో ఒక పతకం గ్యారంటీగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
మోడీ అభినందనలు Asia Games
ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ ముందెన్నడూ లేనివిధంగా రాణిస్తోంది అని తెలిపారు. భారత్ సాధించిన 86 పతకాలు మన అథ్లెట్ల అసమానమైన అంకితభావం, క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఇది భారత్‌కి అత్యుత్తమం అని తెలిపారు. మెడల్స్ గణాంకాల ప్రకారం భారత్ గెలిచిన ప్రతి పతకం మన అథ్లెట్ల కృషి అని అభినందించారు. ఇది యావత్ భారత్ గర్వించదగ్గ విషయం అని ప్రశంసలు కురిపించారు. భారత క్రీడాకారులకు అభినందనలు అంటూ ప్రధాని మోదీ తెలిపారు.
పతకాల పట్టికలో నాలుగో స్థానం
మెన్స్ రిలే టీమ్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్యను 86కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా… చైనా 316 పతకాలతో 171 గోల్డ్, 94 సిల్వర్, 51 బ్రాంజ్ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్‌తో 37, 51, 59 రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో 33, 45, 70 మూడో స్థానంలో ఉన్నాయి.