B-12
ఏదైనా మితంగా తింటేనే అది అమృతం అవుతుంది, మితిమీరిందంటే అది విషంతో సమానం. ఇది మన పెద్దలు చెప్పిన మాటే. మన ఆహారంలో పోషక విలువలు తగినంత ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ ఈ పోషక విలువలు ఎక్కువైతే కూడా మన ఆరోగ్యానికి అపాయమే అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఒక్కోసారి పోషక విలువలు అతిగా తీసుకున్నా ప్రమాదమే. చాలా మంది ప్రజల్లో విటమిన్ బి-12 లోపిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రజలు విటమిన్ బి12 పుష్కలంగా దొరికేలాగా మాంసం, సీ ఫుడ్ తో పాటు సప్లిమెంట్లు తరచూ తీసుకుంటారు. అయితే శరీరానికి విటమిన్ బి-12 ఎక్కువైనా హానికరమే. విటమిన్ బి12 వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మాత్రం విటమిన్ బి 12 లోపించినప్పుడు టాబ్లెట్లు, ఇంజక్షన్స్ వాడతారు కొంతమంది. విటమిన్ బి-12 ఎక్కువైనా కూడా సమస్యలు తప్పవని డాక్టర్లు చెబుతున్నారు.
ఎక్కువ అయితే వచ్చే ప్రమాదాలు… B12
విటమిన్ బB-12 అధికవైతే మైకం రావడం, వాంతులు అవ్వడం కూడా జరుగుతుంది. తలనొప్పి, వాపు, చర్మంపై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, జలదరింపు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. ఇక ఈ విటమిన్ మరీ ఎక్కువ అయితే అనాఫిలాక్సిస్ అనే అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. దీనివల్ల ముఖం, నాలుక, గొంతు వాపు సమస్యలు వస్తాయి. కాబట్టి విటమిన్ బి 12 ని మితిమీరి అసలు తీసుకోకూడదు. మితంగా తీసుకోవడం మంచిది.
ఇంజక్షన్స్ అస్సలు వద్దు…
ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే విటమిన్ బి12 ఇంజక్షన్స్ డాక్టర్ చెబితే తప్ప తీసుకోకపోవడమే మంచిది. కండరాల్లో ఈ ఇంజక్షన్లు చేస్తారు. వీటిలో సాధారణంగా హైడ్రాక్సోకోబాలమిన్ లేదా సైనోకోబాలమిన్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్లు త్వరగా, మరింత ఎక్కువగా శరీరంలో బి-12 కలిసేలా చేస్తాయి. అందుకే వీటి అతిగా వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం చాలానే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
B-12 ఎంత తీసుకుంటే మంచిది…
నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్ ప్రకారం, 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 2.4 మైక్రోగ్రాములు విటమిన్ బి-12 తీసుకోవాలి. ప్రెగ్నెంట్ మహిళలు 2.6 మైక్రోగ్రాములు, పాలిచ్చే మహిళలు 2.8 మైక్రోగ్రాములు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు 25-100 మైక్రోగ్రాములు బి-12 తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం శ్రేయస్కరం.
B-12 సప్లిమెంట్లను ఎప్పుడు వాడాలంటే…
ఎర్ర రక్తకణాల పుట్టుకకు, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో విటమిన్ బి12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ బి12 జంతు సంబంధ ఆహారం ద్వారా మాత్రమే లభిస్తుంది.అందుకే శాకాహారులు బి12 మాత్రలను లేదా సప్లిమెంట్లను వాడుతుంటారు.ఆహారం ద్వారా తగినంత బి12 అందని వారు కూడా సప్లిమెంట్లపై ఆధారపడతారు. సప్లిమెంట్లకు బదులుగా విటమిన్ బి12ని ఆహారం నుంచే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.విటమిన్ B12 ఉదయం తీసుకుంటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఎందుకంటే రాత్రిపూట తీసుకుంటే నిద్రకు భంగం వాటిల్లుతుంది.B12 సప్లిమెంట్లను తీసుకునేవారు ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.