వేల రూపాయలు ఉంటే.. లక్షాధికారులవ్వాలని అనుకుంటాం. లక్షలు ఉంటే కోటీశ్వరులం కావాలని కలలు కంటాం. శ్రమిస్తాం. కోటీశ్వరులమయితే చాలు తరతరాలు తమ కుటుంబం సుఖపడిపోతుందని నమ్ముతాం. అయితే ఒక కోటీశ్వరుడు తనకున్న కోట్లాది ఆస్తులను త్యజించి సన్యాసిగా మారిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఢిల్లీలోని భన్వర్ లాల్ రఘునాథ్ దోషి ప్లాస్టిక్ వ్యాపారం చేస్తుంటారు. ముప్ఫయివేలతో వ్యాపారాన్ని ప్రారంభించి చివరకు ఆరు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నాయి.
విలాసవంతమైన…
ఖరీదైన కార్లు. సూట్లు, బూట్లు వేసుకుని తిరుగుతూ బతకాల్సిన భన్వర్ లాల్ రఘునాథ్ దోషి సర్వం త్యజించి సన్యాసిగా మారారు. విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పారు. ఆరు వందల కోట్లు తనకు వద్దని చెబుతూ ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. తనకున్న ఆస్తులతో ఎన్నో కుటుంబాలను ఆదుకున్న భన్వర్ లాల్ రఘునాథ్ దోషికి జీవితంపై విరక్తి చెందింది. ధనంపై వ్యామోహం సన్నగిల్లింది. ఎంత సంపాదించినా నాలుగు మెతుకుల కోసమే కదా? అన్న వైరాగ్యం ఆవహించింది. అయితే అనుకున్నదే తడవుగా తాను జైన మతం స్వీకరిస్తానన్న ప్రతిపాదనను కుటుంబ సభ్యుల ముందు ఉంచాడు.
జైన మతం స్వీకరించి…
అందుకు తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంత బతుకూ బతికి చివరకు సన్యాసి కావడమేంటని కోప్పడ్డారు. అభ్యంతరం చెప్పారు. కానీ భన్వర్ లాల్ రఘునాథ్ దోషి మాత్రం తాను అనుకున్న ప్రకారమే జీవనం కొనసాగిస్తానని చెప్పారు. అంతే అహ్మదాబాద్ లో ఒక భారీ వేడుకను నిర్వహించారు. లక్షల మంది జనం మధ్యలో దోషి జైన్ ఆచార్య శ్రీగుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికాన్ని స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి అద్వానీ గ్రూపు అధినేత గౌతమ్ అదాని కూడా హాజరయై భన్వర్ లాల్ రఘునాథ్ దోషిని సత్కరించారు. నిన్నటి వరకూ ఆరు వందల కోట్ల అధిపతి నేడు సన్యాసిగా మారిన వైనం నెట్టింట వైరల్ గా మారింది.