Bharat NCAP: భారతీయ ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న Bharat NCAP (New Car Assesment Programme)ను ఆగెస్ట్ 22, మంగళవారం నాడు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూ ఢిల్లీ లో జరుగుతున్న GeoSmart 2023 కాన్ఫరెన్స్ లో వర్చ్యువల్ మార్గంలో ప్రారంభిస్తారు. ఇప్పటివరకు భారతీయ కార్లు సేఫ్టీ రేటింగ్ పొందాలంటే విదేశాలలోని గ్లోబల్ NCAP కు పంపేవారు. విదేశాలలో క్రాష్ టెస్టింగ్ పూర్తి చేసుకున్న కార్ల సేఫ్టీ రేటింగ్ రావడానికి చాలా ఆలస్యం అయ్యేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం భారత్ NCAP ను ప్రవేశ పెట్టింది. ఇక మీదట దేశీయ కార్ల తయారీదారులు, ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 చట్టానికి లోబడి తమ కార్లను స్వచ్ఛందంగా క్రాష్ టెస్టింగ్ మరియు వాటి భద్రతా ప్రమాణాలను పరీక్షించడానికి భారత్ NCAP కు అందించాల్సి ఉంటుంది. భారత్ NCAP కు దేశంలోని ఏ కార్ల షోరూం లో నుంచైనా కార్లను పరీక్షించడానికి తీసుకువెళ్లే పూర్తి అధికారం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్ NCAP వల్ల దేశంలో సురక్షితమైన కార్లకు డిమాండ్ పెరగడంతో పాటుగా కార్ల కంపెనీలు కూడా తమ సేఫ్టీ రేటింగ్స్ ను పెంచుకోవడానికి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తాయని తద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా భారతీయ కార్లకి మంచి డిమాండ్ రావడం తో కార్ల ఎగుమతులు పెరుగుతాయి. భారత్ NCAP చేసే క్రాష్ టెస్ట్ పరీక్షలలో ముఖ్యంగా పాదచారులకు అనుకూలమైన కార్ డిజైన్, నిర్మాణ భద్రత, యాక్టివ్ మరియు పాసివ్ సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీలను పరీక్షించి స్టార్ రేటింగ్ ఇస్తుంది. ఈ పరీక్షలు అన్ని దాదాపుగా గ్లోబల్ NCAP మరియు EURO NCAP యొక్క సేఫ్టీ ప్రోటోకాల్ నిబంధనలకు సమానంగా ఉండడంతో పాటుగా వాటిలానే ఒకటి నుంచి ఐదు వరకు స్టార్ రేటింగ్లు ఇస్తుంది.
3.5 టన్నులు లోపు ఉన్న కార్లకు మాత్రమే స్టార్ రేటింగ్
దేశంలోని 3.5 టన్నులు మరియు అంత కంటే తక్కువ బరువు ఉన్న కార్లతో తో పాటుగా 8 మంది వరకు ప్రయాణించగలిగే వాహనాలకు మాత్రమే భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ ఇస్తుంది. భారత్ NCAP చేసే క్రాష్ టెస్టింగ్ పరీక్షలలో ముఖ్యంగా కారు అడల్ట్ ఓక్యుపెంట్స్ (AOP) మరియు చైల్డ్ ఆక్యుపెంట్ (COP) యొక్క భద్రతకు సంబంధించి వేరు వేరుగా స్టార్ రేటింగ్ లు ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలు కాకుండా భారత్ NCAP సి ఎన్ జి(CNG) మరియు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా సేఫ్టీ టెస్టింగ్ చేస్తుంది. దీనివల్ల కార్ల కొనుగోలుదారులు ఏ వాహనాన్ని కొనాలో నిర్ణయం తీసుకోవడంలో ఉపయోగపడుతుందని ఆటో మొబైల్ విశ్లేషకులు తెలిపారు.