(BJP)
నితిన్ గడ్కరీ సీనియర్ నేత. ఈసారి ఆయన పోటీ చేయడం అనుమానంగానే కనిపిస్తుంది. సీనియర్లను పక్కన పెట్టే క్రమంలో ఈసారి నితిన్ గడ్కరీని కూడా పార్టీ హైకమాండ్ పక్కన పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అవసరమైతే ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో్ పోటీ చేయడానికి మాత్రం పార్టీ నాయకత్వం సుముఖతగా లేదని చెబుతున్నారు. ప్రస్తుతం మోదీ కేబినెట్ లో రాజ్ నాధ్ సింగ్ తో పాటు నితిన్ గడ్కరీ కూడా సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం మోదీ మంత్రి వర్గంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన వచ్చేఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో్ పోటీకి సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. అనేక కారణాలతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని గడ్కరీ సన్నిహితులు చెబుతున్నారు.
నిక్కచ్చి మనిషిగా…
నితిన్ గడ్కరీ నిక్కచ్చి మనిషి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజం గడ్కరీది. పారిశ్రామికవేత్త నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. 70 ఏళ్ల తర్వాత ఎటువంటి పదవులు బీజేపీలో ఉండవు. అందుకే గడ్కరీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్వచ్ఛందంగా తనంతట తానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ గెలిచి మంత్రి అయినా ఏడు పదుల వయసు కారణంగా చూపి తొలగించరన్న గ్యారంటీ లేకపోవడమే ఆయన రాజకీయ నిర్లిప్తతకు కారణమని చెబుతున్నారు.
ఆర్ఎస్ఎస్ నుంచి… (BJP)
నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. నాగ్ పూర్ లో జన్మించిన గడ్కరీ చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీ యువమోర్చా, ఏబీవీపీలలో పనిచేశారు. మహారాష్ట్రలో మంత్రిగా పనిచేసిన నితిన్ గడ్కరీ ఆ తర్వాత నాగపూర్ లోక్ సభ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వరసగా నాగపూర్ నుంచి విజయం సాధించి మోదీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. కానీ అప్పుడప్పుడు ప్రభుత్వంపైనా, కేంద్ర నాయకత్వంపైన కూడా తన అసంతృప్తిని నితిన్ గడ్కరీ వెళ్లగక్కుతారు. అదే ఆయనకు పార్టీలో మైనస్ అని చెప్పాలి. ముక్కుసూటితనం, మొహమాటం లేకపోవడం ఒక్కోసారి గడ్కరీ చేసిన కామెంట్స్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయని పార్టీ నేతలే అంగీకరిస్తారు.
పోటీ చేయరట…
ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో పోటీ చేసి తాను నెగ్గినా, మంత్రివర్గంలో చోటు కల్పించినా వయసు బూచి చూపి తనను మధ్యలోనే కేబినెట్ నుంచి తొలగిస్తారన్న అనుమానం ఆయనలో ఉంది. మంచి పేరున్నప్పుడే సర్దుకుంటే బెటర్ అని ఈ మరాఠా నేత భావిస్తున్నారు. మోదీ, షా ద్వయం కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. సీనియర్ నేతగా అంతా బాగున్నప్పుడే తాను తప్పుకుంటే హుందాగా ఉంటుందని గడ్కరీ కూడా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి నాగపూర్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తం మీద నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేస్తారా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. (BJP)