నోట్ల మార్పిడి కేసులో కూరుకుపోయిన ఏఆర్ సీఐ స్వర్ణలత సినిమాలపై మోజు పడ్డారు. సినిమాల్లో నటించేందుకు ఆమె డబ్బు సంపాదనలో పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఇప్పుడు స్వర్ణలత వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. రెండు వేల నోట్ల రూపాయలను భారీ సంఖ్యలో రిటైర్డ్ నేవీ అధికారుల నుంచి తీసుకుని వారిని బెదిరించిన కేసులో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్వర్ణలతతో పాటు మరో నలుగురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.
సినిమాల్లో చేరేందుకు…
స్వర్ణలత అందంగా ఉండటంతో ఆమెను సినిమాల్లో చేరాలని కొందరు ప్రోత్సహించారు. దీంతో ఆమె మనసు సినిమాలపైకి పాకింది. విశాఖకు చెందిన ఒక రాజకీయ నాయకుడు స్వర్ణలతతో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమాలో స్వర్ణలత కూడా పెట్టుబడి పెట్టేందుకు అడ్డదారులను తొక్కారని పోలీసులు చెబుతున్నారు. గతంలో కెరీర్ పరంగా అనేక అవినీతి ఆరోపణలు స్వర్ణలతపై వచ్చాయి. అందుకే ఏఆర్ సీఐకింద ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో…
అయితే సినిమాలపై మక్కువ చంపుకోని స్వర్ణలత డ్యాన్సులను నేర్చుకునేందుకు ఒక కొరియోగ్రాఫర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కొరియోగ్రాఫర్ స్వర్ణలతకు పాటకు స్టెప్పులు వేయడం నేర్పించారు. వీటిని వీడియోలు తీశారు. స్వర్ణలత అరెస్ట్ అయిన తర్వాత ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. స్వర్ణలత AP 31 మిస్సింగ్ అనే సినిమా చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిని పోస్టర్ కూడా విడుదలయింది. ఈ పోస్టర్ కూడా ఇప్పుడు నెట్టింట దర్శనమిస్తుంది. మొత్తం మీద స్వర్ణలత సినిమా పిచ్చితో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినట్లు కనిపిస్తుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరి ఇంకా ఎన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నది చూడాల్సి ఉంది.