జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ ది నిలకడలేని వ్యక్తిత్వమన్నారు. బీజేపీతో అంటకాగుతూ తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలని దళారీ పాత్ర పోషిస్తున్నారని నారాయణ అన్నారు. పవన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియదన్న నారాయణ ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని తిట్టిపోసిన పవన్ కల్యాణ్ ఈరోజు అదే పార్టీతో కలసి ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం…
ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. నిన్నటి వరకూ చెగువేరా దుస్తులు వేసుకుని, నేడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడన్నారు. కదలకుండా మూడు నిమిషాలు కూడా మాట్లాడలేని పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. పవన్ ను ఎవరూ నాయకుడిగా చూడటం లేదని, ఒక సినీ హీరోగా మాత్రమే చూస్తున్నారని నారాయణ అన్నారు.