తెలుగు రాష్ట్రాలను డెంగ్యూ(Dengue) వ్యాధి భయపెడుతోంది.తీవ్రమైన జ్వరం లక్షణాలతో అనేక మంది ఆస్పత్రులకు క్యూ కట్టడంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సీజన్ మారడం వర్షాలు బాగా పడుతుండటతో దోమలు పెరిగిపోతున్నాయి.దోమ కాటువల్ల వచ్చేదే డెంగ్యూ వ్యాధి.. అందుకే దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు…
డెంగ్యూ వస్తే… (Dengue)
డెంగ్యూ వైరస్ బారిన పడిన వారికి సాధారణంగా తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. తలనొప్పి భరించలేనట్లుగా వేధిస్తుంది. దీంతోపాటు కళ్ల నొప్పులు, మంటలు, ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి. వికారంగా అనిపించడం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
పెచ్చరిల్లుతున్న డెంగ్యూ కేసులు… (Dengue)
డెంగ్యూ వ్యాధి రోజురోజుకి విస్తరిస్తున్న కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా,అతిభారీ వర్షాలు పడటం వల్ల గుంతలు, ఇతర ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. రోజుల తరబడి ఎండ అన్నది లేకుండా వర్షమే కురుస్తుండటంతో వాతావరణం చల్లబడి దోమలు పెరుగుతున్నాయి. మొక్కలు , చెట్లు ఎక్కువగా ఉన్న చోట కూడా దోమలు చేరతాయి. అలాగేనీళ్లు నిల్వ ఉన్న చోట దోమలు చేరతాయి. డెంగ్యూ దోమలు ఒకసారి విస్తరిస్తే ఇక ఆ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతాయి.
వర్షాల సమయంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిశ్చలంగా ఉండే నీటి నిల్వలు ఎక్కువ ఉండకూడదు. వర్షం పడి తగ్గిన తర్వాత ముఖ్యంగా ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన నీటి నిల్వలను వెంటనే తొలగించాలి.ఇళ్ల పైకప్పులు, గుంతలు, పాత సామాన్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంటి పై కప్పు భాగంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.. రాబోయే నాలుగు నెలలు చాలా కీలకం. ఇంట్లో పసి పిల్లలు,వృద్ధులు ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
నివారణ మార్గాలు
దోమకాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు దోమ తెరను ఉపయోగించాలి. మస్కిటో రెపెల్లెంట్ లోషన్లు దోమలు మన దగ్గరికి రాకుండా కాపాడుతాయి. పడుకునేముందు దోమలు ఎక్కువగా కుట్టడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో వీటిని రాసుకోవాలి. గాయాలు ఉన్న దగ్గర దీన్ని రాయకూడదు.
దోమ కాటును నివారించడానికి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్ షర్టులు, పొడవైన ప్యాంటు ధరించడం మంచిది. పరిసరాల పరిశుభ్రతకోసం నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంటేనే…
పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతతిని పెంచుకుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖాళీ డబ్బాలు, కుండలు తనిఖీ చేస్తుండాలి. ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ కుండలు, కంటైనర్లు, పాత బకెట్లు,
ఇతర డబ్బాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకుండా వాటిని బోర్లించేయాలి. ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్ లను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి. లేదంటే కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది.
దోమల నివారణకు మార్గాలు
దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో ఎండిన వేపాకులతో పొగ వేయవచ్చు.. హారతి కర్పూరం బిళ్లలు వెలిగించవచ్చు. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, క్రీములు వాడుకోవచ్చు. అయితే అవి ముఖానికి అప్లయ్ చేయకపోవడమే మంచిది. దోమలను చంపేందుకు మస్కిటో బ్యాట్స్ మార్కెట్ లో దొరుకుతాయి. వాటితో దోమలను నిర్మూలించుకోవచ్చు.. ఇంటి కిటికీలు, డోర్లకు మెష్ వేయించుకుంటే కొంత వరకూ దోమల బెడదను నివారించవచ్చు..