ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “వ్యూహం” రెండో టీజర్‌ను వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ RGV విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలయిన నిమిషాల్లోనే సంచలనం సృష్టిస్తుంది. ఈ టీజర్లో చిరంజీవి, పవన్, సోనియా గాంధీ, చంద్రబాబు పాత్రలను కూడా కనిపించడంతో ఏపీ ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న వ్యూహం రెండు పార్టులుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. రెండో టీజర్లో వర్మ సొంతంగా పాడిన పాట ఉండటం విశేషం.
రెండో టీజర్…
2009 నుంచి జగన్ రాజకీయంగా ఎలా ఎదిగిందీ… ఆయన పడిన కష్టాలు.. జగన్ ను పెట్టిన ఇబ్బందులను ప్రధానంగా ఇందులో చూపెట్టనున్నారు. వైఎస్ మరణించిన తర్వాత నాటి నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు ఈ చిత్రంలో చోటు చేసుకున్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఇప్పటికే తొలి టీజర్‌ను విడుదల చేసిన రామ్‌గోపాల్ వర్మ ఆగస్టు 15 సందర్భంగా రెండో టీజర్ ను నేడు విడుదల చేశారు. రెండో టీజర్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి అనంతరం కాంగ్రెస్‌లో విలీనం చేసేంత వరకూ చూపించినట్లు తెలుస్తుంది. చిరంజీవి పాత్ర ఉండటంతో వర్మ దానిని స్మూత్ గా డీల్ చేశాడా? లేదా? అన్న టాక్ చిత్ర పరిశ్రమలో జరుగుతుంది.
చంద్రబాబు డైలాగులతో… RGV
మరోవైపు పవన్ కల్యాణ్‌ను వ్యూహం చిత్రంలో ఏకిపారేస్తున్నట్లు ఈ రెండో టీజర్ ద్వారా అర్థమవుతుంది. చంద్రబాబు పాత్ర చెప్పే డైలాగ్ ప్రకారం పవన్ తనంతట తానే వెన్నుపోటు పొడుచుకుంటాడని, ఎవరో వెన్నుపోటు పొడవాల్సిన అవసరం లేదని చెప్పించడంతో రామ్‌గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసినట్లు కనపడుతుంది ఇటీవల కాలంలో పవన్ వారాహి యాత్ర ద్వారా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ ను సృష్టించడం వంటివి కూడా రాజకీయంగా దుమారం రేపాయి. వీటికి దీటుగా ఈ చిత్రంలో వర్మ పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది.
హైప్ తీసుకొచ్చే….
వైఎస్ మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. జగన్‌పై జరిగిన కుట్రతో పాటు 2009 నుంచి 2014 వరకూ జరిగిన పరిణామాలనే ఇతివృత్తంగా ఈ వ్యూహం సినిమా తీసుకున్నాడు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల్లో అచ్చు పోలికలున్న నటీనటులను తీసుకొచ్చి రాజకీయ నేతలుగా యాక్ట్ చేయించడం చూస్తూనే ఉంటాం. ఈ వ్యూహం చిత్రంలో సోనియా గాంధీ నుంచి అన్ని క్యారెక్టర్లను జొప్పించి వర్మ సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడంటున్నారు. అయితే సినిమా మొత్తం మీద పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వర్మ ఎక్కువగా విమర్శలు చేసినట్లు ఈ టీజర్ ను బట్టి అర్థమవుతుంది. వర్మ వ్యూహం రెండో టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరి టీజర్లోనే ఇలా ఉంటే ఇక అసలు సినిమాలో ఏం చేప్తాడు.. ఏం చూపిస్తాడన్న ఆసక్తి ఏపీలోని అన్ని పార్టీలలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎలాంటి వివాదాలకు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది. RGV